South West Monsoon | మరో మూడ్రోజులపాటు వాతావరణం చల్లగానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు (South West Monsoon) ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం , పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు అదే ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది.
తగ్గనున్న ఉష్ణోగ్రతలు
ఈ వాతావరణ స్థితుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కుమ్రంభీం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.