Site icon vidhaatha

PDSU: భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో.. ఉద్యమాలు ఉధృతం చేద్దాం

విధాత, వరంగల్: భారత జాతీయోద్యమ విప్లవ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువత కలిసికట్టుగా కుల,మత, దోపిడీ, ఆర్థిక సమానతలకు వ్యతిరేకంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉద్యమాలు ఉధృతం చేద్దామని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహ రావు పిలుపునిచ్చారు.

ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి గేటు ముందు మరియు కె.యు. గర్ల్స్ హాస్టల్స్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను స్మరిస్తూ వారి చిత్రపటాలకు పూలతో ఘనంగా నివాళి అర్పించి, 94వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ అతి చిన్న వయసులో, నునూగు మీసాల నవయవ్వనంలో భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను లెక్క చేయకుండా ఉరికంబానికి అర్పించి షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ లు భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.

మోడీ ప్రభుత్వం భారత జాతీయోద్యమంలో ప్రాణాలర్పించిన జాతీయోద్యమ విప్లవ వీరుల జీవిత చరిత్ర ను పాఠ్యాంశాలలో నుంచి తొలగిస్తూ భవిష్యత్ తరాలకు వారి పోరాట సాహసాలు,స్ఫూర్తి, చేసిన త్యాగాలు తెలియకుండా కుట్రపూరిత విధానాలు అనుసరిస్తున్నదన్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట దోచుకుంటే, నేడు మోడీ ప్రభుత్వ అండదండలతో ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులు, అనేక బహుళ జాతి కంపెనీలు దేశ సంపదను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి విద్యార్థి, యువత భారత జాతీయ ఉద్యమ వీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించి సమానత్వ సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి వి. కావ్య, ఉపాధ్యక్షులు పి. అనూష, గణేష్ , వంశీ,సహాయ కార్యదర్శులు ,యాదగిరి, చందన, కోశాధికారి సంగీత, యూనివర్సిటీ నాయకులు చారి, పెరియార్ ,మల్లేష్, శ్రీజ, నరేష్, సాధన, మనోజ్, నవీన్, అంజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version