కరోనా బారిన పడి తాత, తండ్రిని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణకు అన్నగా.. అండగా నిలుస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. లోకేష్ కృష్ణ చదువు కొనసాగించేందుకు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడంతో నారా లోకేష్ కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా వున్న దశలో దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే, ఏపీలో పరీక్షలు పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అని ప్రభుత్వానికి లేఖలు రాశారు.
జగన్‌రెడ్డి గవర్నమెంట్ స్పందించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో డిజిటల్ టౌన్‌హాల్ మీటింగ్ నిర్వహించారు. పరీక్షలు వద్దంటూ లక్షలాది మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. అందరి అభిప్రాయాలతో గవర్నర్ గారికి కూడా నారా లోకేష్ లేఖ రాశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి చెరుకూరి లోకేష్ కృష్ణ మాట్లాడుతూ తన ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, తాతయ్య ఒకచోట, నాన్న ఒక చోట చికిత్స పొందుతున్నారని తాను కూడా కోవిడ్ బారినపడ్డానని, పరీక్షలు ఎలా రాయగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.
హోం ఐసోలేషన్‌లో వున్న లోకేష్ కృష్ణ జాతీయ మీడియాతో కూడా తన దుస్థితి వివరించి, పరీక్షలు వాయిదా వేయాలని కోరాడు. అంతా వద్దన్నా పరీక్షలు నిర్వహణకే ప్రభుత్వం కట్టుబడి వుండడంతో విద్యార్థుల ప్రాణాల రక్షణ కోసం నారా లోకేష్ న్యాయపోరాటం ఆరంభించారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం ఎట్టకేలకు పరీక్షలు వాయిదా వేసింది. చెరుకూరి లోకేష్ కృష్ణ తాతయ్య మల్లికార్జునరావు మే 7 న, తండ్రి వెంకట సుబ్బారావు మే 9న కోవిడ్‌కి చిక్సిత పొందుతూ మృతి చెందారు.
నాయనమ్మ,అమ్మ,లోకేష్ కృష్ణ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాతయ్య, తండ్రిని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి లోకేష్ కృష్ణకి అండగా వుంటానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారికి కుటుంబ పెద్దల్ని కోల్పోయిన విద్యార్థికి అన్నగా అండగా వుంటానని భరోసా నింపారు.