Site icon vidhaatha

Telangana Cabinet | జూన్‌ 23న తెలంగాణ క్యాబినెట్‌ మీటింగ్‌.. అజెండా అంశాలు అవేనా?

Telangana Cabinet | కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్‌కు ఇవ్వాల్సిన ఫైళ్లపై తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతున్నది. ఈ సమావేశంలో కాళేశ్వరం ఫైళ్లతో పాటు బనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించనున్నారని తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి మండలి ఆమోదంతోనే చేపట్టామని మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి టీ.హరీశ్ రావు తమ విచారణ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌కు తెలిపిన విషయం విదితమే. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తాను ప్రాతినిధ్యం వహించిన మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క మంత్రి మండలి సమావేశంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆమోదం తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఇటీవలే మూడోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను పంపించాల్సిందిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిని కోరింది. ఇప్పటికీ రెండుసార్లు లేఖలు రాశామని, ఎందుకు పంపించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కాళేశ్వరం కమిషన్ అడిగిన విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మంత్రి మండలి సమావేశం తీర్మానాలు, ఏజెండా కాపీలు, ప్రాజెక్టకు కు సంబందించిన ఉత్తర, ప్రత్యుత్తరాలు జూన్ నెలాఖరు లోపు పంపిస్తామని చెప్పారు. ఏ సమాచారం పంపించాలనే దానిపై సోమవారం జరిగే మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన గోదావరి, కృష్ణా నదీ జలాల న్యాయమైన వాటాల పంపిణీపై ఏం చేయాలనే దానిపై చర్చించి, కార్యాచరణను ఆమోదించనున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version