CM Revanth Reddy | చర్చల ద్వారానే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. తాము వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందని, అందులో చర్చించి, అవసరమనుకుంటే ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తానని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కర్ణాటకతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టే ఏపీతోనూ ఉండాలనేది తమ విధానమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఉన్న సమస్యలే ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బీఆరెస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మోదీకి చంద్రబాబు అవసరం ఉందని, ఏపీలో మళ్లీ చంద్రబాబు గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరమని రేవంత్ అన్నారు. ఇక్కడ చనిపోయిన బీఆరెస్‌ను బతికించుకునేందుకు గోదావరి జలాల అంశాన్ని సంజీవినిలా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కయ్యాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘కిషన్ రెడ్డి ట్యూటర్ కేటీఆర్, కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్ రెడ్డి’ అని విమర్శించారు. నాడు బీఆరెస్ చేసిన అవయవదానంతోనే బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచిందని చెప్పారు.
అన్యాయం చేసిందే కేసీఆర్, హరీశ్
తెలంగాణకు సాగునీటిలో విషయంలో అన్యాయం చేసిందే కేసీఆర్, హరీశ్‌రావు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. బనకచర్లకు బీజం పడిందే 2016లోనని చెప్పారు.
2016, 2018 సంవత్సరాలలో సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని తెలిపారు. అప్పడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆరెస్ ప్రభుత్వం ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదని ప్రశ్నించారు. పెన్నా నదికి 400 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించేందుకు ఏపీ ప్లాన్ చేసిందని చెప్పారు. పోలవరం నుంచి సోమశిల ద్వారా 86 రోజుల్లో 400 టీఎంసీల వరద జలాలను మళ్లించేందుకు ప్రణాళిక వేశారని తెలిపారు. గోదావరి వరద జలాలను తరలించుకోవాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు కేసీఆర్ చెప్పారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘2015, 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాలకు సంబంధించి 2009 టీఎంసీలకు ఒప్పుకున్నది కేసీఆర్, హరీశ్‌రావులే. తర్వాత 2023లో తప్పు చేశామని ఒప్పుకొని, కృష్ణా జలాల్లో 50% అంటే 405 టీఎంసీలు ఇవ్వాలని అడిగిందీ హరీశ్‌రావే. నేను 500 టీఎంసీలు అడిగితే తప్పుపడుతున్న హరీశ్‌రావు.. 45 టీఎంసీల నీళ్లు చాలని ఎలా లేఖ రాశారు? ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలివితేటలకు, పొడుగ్గా పెరగడానికి సంబంధం లేదన్న రేవంత్.. హరీశ్ రావు అతి తెలివితో అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్, హరీశ్ చెబుతున్న అబద్ధాలు వింటే తానేనా వాళ్లను సృష్టించింది? అని దేవుడు సైతం ఆశ్చర్యపోతాడని రేవంత్ సెటైర్ వేశారు.
కాళేశ్వరంతో 50వేల ఎకరాలకే కొత్త ఆయకట్టు
కాళేశ్వరం ప్రాజెక్టుతో 50వేల ఎకరాలకు మాత్రమే కొత్తగా ఆయకట్టు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మొత్తం 2 లక్షల కోట్ల ప్రాజెక్టు 1,27,872 కోట్ల మేరకు టెండర్లకు పిలిచారని, అందులో 96 వేల కోట్లు చెల్లింపులు చేశారని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 50,000 కోట్ల రూపాయలు అవసరమని వివరించారు. బీఆరెస్ హయాలో కమీషన్ల కోసమే పేర్లు మార్చి, ఎస్టిమేషన్లు పెంచి ప్రాజెక్టులు కట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఒకనాడు నిజాం నవాబు ప్రాజెక్టులు కడితే.. తర్వాత కాంగ్రెస్ కట్టిందన్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ కట్టింది ఏమీ లేదని అన్నారు.