Site icon vidhaatha

Banakacharla | బనకచర్లపై చర్చకు సిద్ధమా? హరీష్‌కు పీసీసీ చీఫ్ సవాల్

Banakacharla | తెలంగాణ నదీ జలాల హక్కులు..బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు హరీష్ రావు సిద్దం కావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాల రాసింది సీఎం కేసీఆర్, హరీష్ రావులేనని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నదీ జలాల హక్కులలో తెలంగాణకు బీఆర్ఎస్ చేసిన అన్యాయమేమిటో ఆధారాలతో సహా అన్ని లెక్కలను సభలోనే బయట పెడతామన్నారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, జగన్ లతో చట్టపట్టాలేసుకుని ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేస్తామని సీఎంగా కేసీఆర్ చెప్పలేదా అని నిలదీశారు. రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తామని కేసీఆర్ చెప్పలేదా?.. నీటి వాటాపై రాజీపడ్డారు కాబట్టే తెలంగాణకు నష్టం జరిగిందన్నారు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెస్తేనే బనకచర్ల ఆగిందన్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేసుకోవాలన్నారు.

బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలిగా లేఖ రాశారా, జాగృతి అధ్యక్షురాలి హోదాలో రాశారో చెప్పాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 21 శాతానికి తగ్గించింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ క్యాబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేనప్పుడు స్పందించారా? ఉద్యమాలు చేశామని చెప్పుకొంటున్న కవిత ఏనాడైనా సాటి మహిళల గురించి మాట్లాడారా అని నిలదీశారు. కవితకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత.. తన మనుగడ కోసం, తన్న అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు బీసీల జపం ఎత్తుకున్నారన్నారు. మీరు రైల్ రోకో చేయండి, విమానం రోకో చేయండి, పడవల రోకో చేయండి కాని.. పదేళ్లలో బీసీలకు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 56% బీసీలు ఉన్న రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించుకోలేని బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీలో సమర్థవంతమైన బీసీలు లేరా అని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి దళితులకు, టీపీపీసీ పదవి బీసీకి, ఎస్టీలో ఐదుగురికి అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని..పరిపూర్ణమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ వల్లే సాధ్యం అన్నారు.

సామాజిక న్యాయ సమరభేరీగా ఖర్గే సభ

ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే ఖర్గే సభకు సామాజిక న్యాయ సమరభేరీగా నామకరణం చేసినట్లుగా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జైబాపు..జైభీం..జైసంవిధాన్‌లో భాగంగా ఖర్గే సభ జరుగుతుందన్నారు. కాగా కాంగ్రెస్‌లో కోవర్టులున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉంటామని మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు.

Exit mobile version