అక్టోబర్ 12న చలో హైదరాబాద్
సెప్టెంబర్ 8 నుండి బస్సుయాత్ర, ఉద్యోగుల సదస్సులు
పిలుపు ఇచ్చిన ఉద్యోగ సంఘాల జేఏసీ
TS JAC Employees Protest | హైదరాబాద్, ఆగస్టు19(విధాత): తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. బీఆరెస్ హయాం నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారికి కూడా సెటిల్ మెంట్ బిల్లులు ఇవ్వకుండా తిప్పుతున్నారని చెపుతున్నారు. మాటలు చెపుతున్న సర్కారు చేతల్లో తమ సమస్యలు పరిష్కరించడం లేదన్న నిర్ణయానికి వచ్చిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమై అక్టోబర్12న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటించామన్నారు.
జేఏసీ ఉద్యమ కార్యాచరణ
ఉద్యమం కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్‌లో వేలాంది మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించామన్నారు, అలాగే ఉద్యోగుల చైతన్యం కోసం సెప్టెంబర్ 8 నుంచి నుంచి బస్సు యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు.
బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా…
సెప్టెంబర్ 8 న వరంగల్ జిల్లా
సెప్టెంబర్ 9 న కరీంనగర్ జిల్లా
సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా
సెప్టెంబర్ 11న నిజాంబాద్ జిల్లా
సెప్టెంబర్ 12న సంగారెడ్డి మెదక్ జిల్లాలలో
సెప్టెంబర్ 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో
సెప్టెంబర్ 16న మహబూబ్నగర్ జిల్లా
సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా
సెప్టెంబర్ 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో
సెప్టెంబర్ 19 నుండి మిగతా జిల్లాలలో
నోటితో పలుకరించి నొసటితో వెక్కిరించినట్లుగా…
ఉద్యోగులు , ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నోటితో పలకరించి , నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని తెలంగాణ ఎంప్లొయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ మారంజగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావులు తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరనర కాలంగా ఉద్యోగులు , ఉపాధ్యాయుల సమస్యలను ఇదిగో తీరుస్తాం , అదిగో తీరుస్తామని కమిటీలు వేస్తూ కాలం గడపడమే తప్ప సమస్యల పరిష్కారం చేయలేదన్నారు. ప్రభుత్వంతో సామరస్యం ముగిసిందని, డిమాండ్ల సాధనకు తమకు ఇక సమరమే మిగిలిందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యోగుల చేసి బస్సు యాత్రలు చేస్తూ ఉద్యోగులను గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు కదిలిస్తామని చివరగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని చెప్పారు.
సీఎం చెప్పినా బిల్లులు ఇవ్వని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాత్సర్యం చేస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావులు అన్నారు. అలాగే ఇహెచ్ ఎస్ ఉద్యోగుల ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇహెచ్ ఎస్ అమలుకు మోకాలు అడ్డుపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బకాయిపడ్డ 5 డీఏ లు అడిగితే కేవలం ఒక్కడిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడంలో ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నదన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం, అధికారుల కమిటీ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఇచిన 63 డిమాండ్ లకు సంబంధించిన నివేదికను ఇంతకాలం. బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం 20 నెలలుగా వేచి చూశామన్నారు. అయినా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపనచేస్తున్నదని, అందుకే ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉద్యోగుల ప్రధాన సమస్యలు ఇవే
1.పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
2. ఆరోగ్య రక్షణ పథకాన్ని (EHS) జూలై నెల ఆఖరులోపే పూర్తిస్థాయిలో నిబందనలనురూపొందించి అమలు చేయాలి.
3.కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్రమం
తప్పకుండా చెల్లించాలి .
4. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
5. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయుటకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారి చేయాలి.
6. 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారి చేసిన 57 మేమో ద్వారా పాత పెన్షన్ అమలు
చేయాలి.
7. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.
8. వివిదకారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
9. గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటా-యించాలి
10. స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి.
11. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి.
అలాగే మిగితా పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలి.
12. నూతనముగా ఏర్పడిన మండలాలకు (MPP) మరియు MEO పోస్టులను మంజూరు చేయాలి
13. S.S.A ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలి.
14. సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాలలో జరుపుతాం.