kaleshwaram commission | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం కాళేశ్వరం విచారణకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఎర్రవెళ్లిలోని తన ఫామ్‌హౌస్‌లో హరీశ్ రావుతో భేటీ అయ్యారు. సుమారుగా 5 గంటల పాటు వీరు కమిషన్ విచారణకు సంబంధించి చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే హరీశ్ రావు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కమిషన్ ఏయే ప్రశ్నలు సంధించింది.. తాను ఏమేం సమాధానాలు చెప్పారు. ఇలా అన్ని అంశాలపై ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ కు వివరాలు సమర్పించేందుకు ఓ నివేదికను సైతం కేసీఆర్ సిద్ధం చేసినట్టు సమాచారం. హరీశ్ రావుతోపాటు .. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరోవైపు కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు భారీగా జనసమీకరణకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలతో ఆయన మాట్లాడుతున్నట్టు సమాచారం. ఎంతమంది జనాలను తరలించాలి.. ఏయే నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకురావాలని.. వారిని తీసుకొచ్చేందుకు సంబంధించిన వాహనాలు ఇలా అనేక అంశాలపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలుస్తున్నది. అయితే ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ఏయే అంశాల ఆధారంగా ప్రశ్నించబోతున్నది అన్న అంశం ఆసక్తికరంగా మారింది.