Site icon vidhaatha

Miss World | మిల్లా మాగీ ఆరోపణలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

Miss World | మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లడ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శిఖా గోయల్‌, ఐపీఎస్‌ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీలకు ఈ విచారణ బాధ్యతలు అప్పగించింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మిస్ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉంది? అనే వివరాలను వారు అడిగి తెలుసుకుంటున్నారు. వీడియోలను సైతం రికార్డు చేస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ పరువుతోపాటు దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. కంటెస్టెంట్ లతోపాటు.. మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు… ఆ రోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

మిల్లా మాగీ ఆరోపణలివే..
హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యానని మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై సంచలన ఆరోపణలు చేశారని బ్రిటిష్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పోటీలలో ఆటబొమ్మల్లా.. వేశ్య మాదిరిగా చూశారంటూ కూడా ఆమె ఆరోపించింది. మిస్ వరల్డ్ -2025 పోటీల నుంచి అర్ధంతరంగా వైదొలిగిన ఆమె.. ఇంగ్లండ్‌ చేరిన తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే మిల్లా మాగీ ఆరోపణలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సైతం తోసిపుచ్చారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారని తెలిపారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారని, ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని జయేశ్‌ రంజన్‌ స్పష్టం చేశారు. తాను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలెస్ డిన్నర్‌లో మాత్రమే పాల్గొన్నారని, ప్రతి టేబుల్‌లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారని తెలిపారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించామని, అలాంటిది ఏమీ జరుగలేదని చెప్పారని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

Exit mobile version