Site icon vidhaatha

Telangana: జీతాల కోసం.. హోంగార్డుల ఎదురుచూపులు!

విధాత: రాష్ట్రంలోని హోంగార్డులకు ఏప్రిల్ నెల సగం గడిచిపోయినా మార్చి నెల వేతనాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 16 వేల మంది హోంగార్డులు.. బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభలు, సమావేశాలు, ఎన్నికల విధుల్లో పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. టీఏ, డీఏ, హెచ్ఎర్ఏలతోపాటు యూనిఫాం అలవెన్స్ సైతం ఇవ్వట్లేదని హోంగార్డులు వాపోతున్నారు.

రిటైరైనా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించట్లేదని.. ప్రభుత్వం ఇటీవల హోంగార్డులకు హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటించినా ఆ ప్రక్రియ ఇంకా అమలుకు నోచుకోలేదని హోంగార్డులు తమ దీన స్థితిని తలుచుకుంటూ ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వం వెంటనే తమ ఇబ్బందులను గమనించి సకాలంలో వేతనాల చెల్లింపుతో పాటు ఉద్యోగపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version