Site icon vidhaatha

salaries | సీఈఓల జీతాలు చుక్క‌ల్లో.. కార్మికుల జీతాలు పాతాళంలో

విధాత‌: దేశంలో కంపెనీ సీఈఓల వేత‌నాలు గ‌త ఐదేళ్ల‌లో 50 శాతం పెర‌గ‌గా కార్మికుల వేత‌నాలు మాత్రం 0.9 శాతం పెరిగాయి. కంపెనీ సీఈఓల స‌గ‌టు వేత‌నం సంవ‌త్స‌రానికి 16.92 కోట్ల రూపాయ‌ల‌కు చేరిన‌ట్టు రీసెర్చ్ అండ్ అడ్వ‌క‌సీ గ్రూప్‌ ఆక్స్‌ఫామ్ తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. సీఈవోలు గంట‌గంట‌కు సంపాదిస్తున్న వేత‌నం కార్మికులు సంవ‌త్స‌రం అంతా సంపాదించే దానికంటే చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆ అధ్య‌య‌నం చెబుతున్న‌ది. అయితే ఆడ, మ‌గ ఉద్యోగుల వేత‌నాల‌ మ‌ధ్య అంత‌రం గ‌తంకంటే త‌గ్గింద‌ని ఆ అధ్య‌య‌నం తెలిపింది.

వేత‌న అంత‌రం గ‌తంలో 27 శాతం ఉండ‌గా ప్ర‌స్తుతం అది 22 శాతానికి త‌గ్గింద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా 11,366 కంపెనీల అధ్య‌య‌నంలో వెల్ల‌డ‌యింద‌ని ఆక్స్‌ఫామ్ తెలిపింది. సీఈవోల వేత‌నాలు 2019 నాటి వేత‌నాల‌తో పోలిస్తే 50 శాతం పెరిగాయ‌ని, కార్మికుల వేత‌నాలు మాత్రం 0.9 శాతం మాత్ర‌మే పెరిగాయ‌ని ఆక్స్‌ఫామ్ తెలిపింది. సీఈవోల‌కు జ‌ర్మ‌నీలో 2024లో స‌గ‌టున అత్య‌ధికంగా 56.69 కోట్ల రూపాయ‌లు చెల్లిస్తుండ‌గా, ఐర్లాండులో 39.7 కోట్లు చెల్లిస్తున్నారు. ద‌క్షిణాఫ్రికాలో 13.5 కోట్లు, భార‌త్‌లో 16.9 కోట్ల రూపాయ‌లు చెల్లిస్తున్న‌ట్టు ఆక్స్‌ఫామ్ అధ్య‌యనం తెలిపింది.

ఏడాదికేడాది ఈ దుస్థితి పెరుగుతున్న‌ది. సీఈవోల వేత‌నాలు తార‌స్థాయికి చేరుతుంటే కార్మికుల వేత‌నాలు కుంచించుకు పోతున్నాయి. ఇది వ్య‌వ‌స్థ‌లోని లోపం కాదు. ఉద్దేశ‌పూర్వ‌కంగా, ప‌థ‌కం ప్ర‌కారం సంప‌ద పైమార్గం ప‌ట్టించి, కార్మికుల‌ను అద్దెలు, ఆహారం, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పోరాడేట్టు చేస్తుంది- అని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అమితాబ్ బెహ‌ర్ అన్నారు. కార్మికుల నిజ‌వేత‌నాలు2024 సంవ‌త్స‌రంలో 2.6 శాతం మాత్ర‌మే పెరిగాయ‌ని, అత్య‌ధిక కార్మికుల వేత‌నాలలో ఎటువంటి మార్పు లేద‌ని అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ‌(ఐఎల్ఓ) పేర్కొంది.

Exit mobile version