Site icon vidhaatha

Telangana | LRS.. రాయితీ గడువు పెంపు !

Telangana | LRS

విధాత: తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS)కు ప్రకటించిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(OTS) పథకాన్ని ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31తేదీతో ఈ పథకం గడువు ముగిసిన నేపథ్యంలో మరో నెలరోజులు కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మొత్తం చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుండగా దానినే కొనసాగిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఓటీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకూ దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకూ ఫీజు చెల్లించారు.

ఇదిలాఉంటే పథకం అమల్లోకి వ‌చ్చిన అనంత‌రం కొద్దిపాటి సాంకేతిక సమస్యలు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అధికారులు వాటిని గుర్తించి పరిష్కరించేలోపు గడువు తేదీ సమీపించింది. ఆపై వ‌రుస‌బెట్టి వ‌చ్చిన‌ పండుగ‌ల కారణంగా చివరి రెండు రోజుల్లో కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలోనే గడువు పొడిగించాలని ప్ర‌జ‌ల నుంచి భారీగా వినతులు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓటీఎస్‌ను మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version