Site icon vidhaatha

Nizamabad | రైతు మహోత్సవంలో దుమ్ము రేపిన హెలికాప్టర్! పరుగులు తీసిన రైతులు, అధికారులు (Video)

విధాత: నిజామాబాద్ రైతు మహోత్సవ ప్రాంగణంలో హెలికాప్టర్ లాండింగ్ రైతులను, అధికారులను పరుగులు పెట్టించింది. నిజమాబాద్ గిరిరాజ్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నీటిపారుద‌ల‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావులు హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకున్నారు.

ల్యాండింగ్ కు సిద్ధం చేసిన హెలిప్యాడ్ కు హెలికాప్టర్ చేరుకోగానే భారీగా దుమ్ము రేగింది. దుమ్ము తీవ్రతకు అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, స్టాళ్లు పడిపోయాయి. దుమ్మును తట్టుకోలేక రైతులు, అధికారుల, మీడియా సిబ్బంది తలో దిక్కు పరుగులు తీశారు. ఈ ఘటనపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఇలా జరుగడంతో అయోమయానికి గురయ్యారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు.

మూడు రోజులపాటు జరిగే రైతు మహోత్సవ కార్యక్రమంలో రైతులు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు సైతం ప్రదర్శనలో ఉంచనున్నారు. సుమారు 136 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన‌వ‌న‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య శాఖ శాస్త్రవేత్తలు, వ్య‌వ‌సాయ‌ అనుబంధ శాఖ‌ల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్ షాపు నిర్వ‌హించ‌నున్నారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు ఇది వేదికగా నిల‌వ‌నుంది. రైతు మహోత్సవాన్ని సందర్శించేందుకు ఉమ్మడి నిజమాబాద్ జిల్లాతో పరిసర జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు.

Exit mobile version