విధాత: కులగణన విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. బుధవారం రెండో రోజు అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ 84వ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపారని..ఈ బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. కులగణన వల్ల దేశంలో బీసీలు, ఆదివాసీల సంఖ్య ఎంతో తెలుస్తుందన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన విజయవంతమైందని.. 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తేలిందన్నారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదన్నారు. వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశ సమస్యలు తీర్చాలంటే, దేశాన్ని ఎక్సరే తీయాలని రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ విమర్శించారు. దేశ జనాభాలోని 90శాతంగా ఉన్న వారికి సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. 90శాతం మంది జనాభా అవకాశాలను లాగేసుకున్నారని విమర్శించారు. చనిపోయాక నా గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరమని.. నేను అనుకున్న పనులు పూర్తి చేశాక ప్రజలు మరిచిపోయినా నాకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ ఐడియాలాజీ రాజ్యంగమని అందుకే బీజేపీ దానిని ధ్వంసం చేయాలని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దానిని కాపాడుకోవాలన్నారు.
ప్రధాని మోదీ “ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారని.. ఇద్దరు వ్యాపారవేత్తలకే వాటిని అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులు, గనులు, సిమెంట్, స్టీల్ సహా కీలక పరిశ్రమలన్నీ ఓ పారిశ్రామికవేత్తకే కట్టబెడుతున్నారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అక్రమాల ద్వారా గెలిచిందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రోజూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరామని.. దీనికి ప్రధాని సహా ఆర్ఎస్ఎస్ తిరస్కరించిందన్నారు. లౌకిక భావనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని విమర్శించారు. దళితుడైన రాజస్థాన్ పీసీసీ నేతను ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారని.. వక్స్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ దేశంలో గుత్తాధిపత్యం కారణంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలతో దేశంలోని సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెలుతుందని విమర్శించారు. అమెరికా భారత్ పై విధించిన 26శాతం సుంకాలపై పార్లమెంటులో చర్చించాలని తాము పట్టుబట్టినా.. వారు పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగం కారణంగా విదేశాలకు వెళ్తున్న యువతను బంధించి వెనక్కి పంపించడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని తప్పుబట్టారు. ‘ఎన్నికల సంస్థలతో సహా అన్నింటిలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కారణంగా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలు అందుబాటులో లేవని.. 140 కోట్ల మంది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారన్నారు. త్వరలోనే ఈ దేశ యువత మేల్కొని బ్యాలెట్లకు మద్దతుగా ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపిస్తారు’ అని ఖర్గే పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఆకాంక్షించారన్నారు. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని..బీసీ రిజర్వేషన్లపై తాము పంపిన బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారన్నారు. బిట్రిష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరమని.. బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలన్నారు.