Site icon vidhaatha

రహదారి పన్ను భారం పదేళ్లు!

పెట్రోలు, డీజిల్‌పై రూపాయి చొప్పున ఏటా రూ.600 కోట్లు
వీటితో బ్యాంకు రుణాలు చెల్లించేందుకు అనుమతి

విధాత,అమరావతి: పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న రహదారి పన్ను భారం రాబోయే పదేళ్ల వరకూ ఉంటుంది. రహదారులు, భవనాల శాఖ బ్యాంకు రుణాల వాయిదాలు పదేళ్లలో చెల్లించేలా అధికారులు కసరత్తు చేస్తుండటంతో అప్పటి వరకూ పన్ను వడ్డింపు ఉంటుందని చెబుతున్నారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ధి కోసమని రహదారి పన్నును గత ఏడాది సెప్టెంబరు నుంచి వసూలు చేస్తున్నారు.

దీనివల్ల నెలకు సగటున రూ.50 కోట్ల చొప్పున, ఏటా రూ.600 కోట్ల వరకు ప్రజలపై భారంపడుతోంది. ఈ పన్ను ద్వారా వచ్చే మొత్తాన్ని ఏపీ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీకి) బదలాయించేలా కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 7,969 కి.మీ. రహదారులను పునరుద్ధరించేందుకు రూ.2,200 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ)ని ప్రభుత్వం అనుమతించింది. రహదారి పన్ను రూపంలో వచ్చే మొత్తంతో వాయిదాలు చెల్లిస్తామంటూ దానిని హామీగా చూపిస్తున్నారు. గతంలో రహదారుల అభివృద్ధి కోసం రూ.3 వేల కోట్ల రుణం తీసుకున్నారు. దీనికి వడ్డీతోపాటు, అసలు కూడా చెల్లిస్తున్నారు. ఈ రెండు రుణాలకు కలిపి వాయిదాలన్నీ పూర్తిగా చెల్లించేందుకు దాదాపు పదేళ్లు పడుతుందని అంచనా.

Exit mobile version