విధాత, న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితి మరింత చేయి దాటక ముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్‌ను అమెరికా కోరింది. ఈమేరకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితులు మరి ఉద్రిక్తంగా మారకుండా చూడాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
మర్కో రూబియో ఇటు భారత్ ను కూడా ఉద్రిక్తతలు సద్దుమణిగేలా చూడాలని కోరారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కు ఫోన్ చేసిన రూబియో అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పాక్ ల మధ్య యుద్దంలో మా జోక్యం ఉండదని చెప్పారు. అయితే దౌత్య మార్గాల్లో ఉద్రిక్తతల నివారణకు మా వంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ సూచనపై స్పందించిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ ఉద్రిక్తతల నివారణకు తాము సిద్దమని ప్రకటించారు. భారత్ దాడులు ఆపితే తాము కూడా ఉద్రిక్తతల తగ్గింపుకు సిద్దమని పేర్కొన్నారు.
దౌత్యపర ప్రయత్నాలతో శాంతి నెలకొల్పాలి : జీ 7దేశాల ప్రకటన
అటు జీ 7దేశాలు కూడా భారత్ పాకిస్తాన్ లను ఉద్రిక్తలు తగ్గించుకోవాలని కోరాయి. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అలాగే రెండు దేశాలు సంమయనం పాటించాలని ఓ ప్రకటనలో కోరాయి. సైనిక దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి, పౌరుల భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు దేశాలు శాంతి కోసం చర్చలు జరుపాలని..దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కారం కోసం తమ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా జీ 7దేశాలు ప్రకటించాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తేలిపాయి.