Cotton Sales | పత్తి కొనుగోళ్లు షురూ.. మంత్రి తుమ్మల హామీతో నిర్ణయం

బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీసీఐ తీరుకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన తెలంగాణ కాటన్ అసోసియేషన్ తమ నిరసనను విరమిస్తున్నట్లు పేర్కొంది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీసీఐ తీరుకు నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన తెలంగాణ కాటన్ అసోసియేషన్ తమ నిరసనను విరమిస్తున్నట్లు పేర్కొంది. దీంతో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జిన్నింగ్ మిల్లులు, మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు, సీసీఐ, ప్రైవేటు ట్రేడర్లు పత్తిని కొనుగోలు చేయనున్నారు. సీసీఐ అనుసరిస్తున్న ఎల్1, ఎల్ 2, ఎల్ 3 అంటూ మిల్లులను కేటగిరిలుగా విభజించి అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు (సోమ, మంగళవారాల్లో ) కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాటన్ మిల్లర్లు, ట్రేడర్ల అసోసియేషన్ తో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చలు జరిపారు. మిల్లర్ల సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ మేరకు అసోసియేషన్ తమ నిరవధిక కొనుగోళ్ల బంద్ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి మల్లేశం కూడా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అసోసియేషన్ తో మంత్రి జరిపిన చర్చలు ఫలించాయని, పత్తి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీ మేరకు కొనుగోళ్ల బంద్ నిలిపివేసి బుధవారం నుంచి యథావిధిగా పత్తిని కొనుగోలు చేస్తారని ప్రకటించారు. బుధవారం నుంచి రైతులు తమ పత్తిని ప్రైవేటు వ్యాపారులుకు, జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐకి విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాటన్ అసోసియేషన్ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులతో ప్రయత్నించకుండా కొనుగోళ్లు నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest News