విధాత, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫై చేసిన 330 జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు చేపట్టాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండితో చేసిన చర్చలు ఫలించాయని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పత్తి కొనుగోళ్లకు సీసీఐ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల వల్ల కొనుగోళ్లకు అనుమతులు లభించలేదు. దీంతో మిల్లర్లు సమ్మెకు దిగారు. దీనిపై స్పంధించిన మంత్రి సంబంధింత సీసీఐ సీఎండీతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో మిల్లర్లు సమ్మె విరమించి కొనుగోళ్లు చేపట్టారు. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సీసీఐ మొత్తం 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించింది. దీని విలువ రూ.2,904 కోట్లుగా మంత్రి కార్యాలయం వెల్లడించింది.
