విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణతో సహా దేశంలోని రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకునేందుకు పలు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి దిగమతి సుంకం ఎత్తివేసిన నేపథ్యంలో ఈ ప్రభావం పత్తి రైతును ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. దేశీయ పత్తి రైతులకు మార్కెట్లో కనీస మద్ధతు ధర లభించకపోగా, మార్కెట్ పోటీ లేకుండా పోవడంతో రైతులకు మరో మార్గం లేకపోవడంతో తక్కువ ధరలకు దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంతో పాటు దేశీయంగా పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, ట్రేడర్లు ఆసక్తిక చూపకపోవడంతో ఒకా నొక దశలో పత్తి కొనుగోలు చేసే వారు లేక రైతులు రోజుల తరబడి పడిగాపులు గాస్తూ చివరికి ఎంతకోకొంతకు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన పత్తి బేళ్ళను కొనేందుకు వస్త్రవ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా మంది వస్త్రవ్యాపారులు దేశీయ పత్తి కంటే ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమకు లాభసాటిగా ఉండే విదేశీ పత్తి వైపు మొగ్గుచూపడంతో పరోక్షంగా ఇక్కడి రైతుల పై ప్రభావం కనబరుస్తోంది. ఈ కారణంగానే సీసీఐ రకరకాల కొర్రీలు, నిబంధనలు పెట్టి పత్తిని కొనుగోలుచేయకుండా జిమ్మిక్కులు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీసీఐ పత్తి కొనుగోలు చేసినా ఆ సంస్థ నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు, వస్త్రవ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో నిల్వలు పెరిగి సంస్థకు ఆర్ధికంగా నష్టమొస్తుందనే ముందుచూపుతో అడ్డంకలు సృష్టిస్తున్నట్లు భావిస్తున్నారు.
దిగుమతి సుంకం ఎత్తివేత ప్రభావం
గతంలో పత్తిపై ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని ఆగస్టు 23వ తేదీన కేంద్రం ఎత్తివేసింది. ఆ సమయంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నిర్ణయాన్ని కొనసాగించనున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ, ఈ పొడిగింపును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. దిగుమతి సుంకం ఎత్తివేతతో విదేశీ పత్తి తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో దేశీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. కేవలం 8శాతం తేమ ఉన్న పత్తికి మద్ధతు ధర క్వింటాల్ కు రూ. రూ.8,110లుగా కేంద్రం ప్రకటించింది. ఈ ధరతో పోల్చితే విదేశీ పత్తి తక్కువ ధరకు లభించడంతోఅటువైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో సీసీఐ కూడా బయటికి చెప్పకుండా తమ కొనుగోళ్ళు తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగ విమర్శ. కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి ఈ విదేశీ సుంకం ఎత్తివేశారని రాజకీయవర్గాలు విమర్శిస్తున్నాయి. ఒక వైపు ట్రంప్ భారత్ పై భారీగా సుంకాలు విధిస్తుంటే మోడీ మాత్రం ట్రంప్ కు జీ హుజూర్ అంటున్నారని ఇప్పటికే మాజీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. సుంకం ఎత్తివేతతో దేశ పత్తి రైతుల పై తీవ్ర ప్రభావం కనబరుస్తుందని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా జూన్, జులై నెలలతో పోలిస్తే ఆగస్సులో పత్తి ధరలు తగ్గాయి. ప్రస్తుతం మద్ధతు ధర రూ.8110 – 7710 కొంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగుకు రూ. 50వేల వరకు ఖర్చవుతోంది. దిగుబడి సగటున 5 క్వింటాల్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్ధతు ధర లభించకపోవడంతో ఎకరాకు ఆదాయం రూ.30వేల వరకు వస్తోంది. ఈ కారణంగా రైతుకు ఇప్పటికే రూ.20వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ కారణంగానే గతంలో పత్తి పై మోజు పెంచుకున్న రైతులు ఇతర పంటల వైపు చూస్తున్నారు. దిగుమతి సుంకం ఎత్తివేతతో టెక్స్టైల్ రంగానికి ఉపయోగకరంగా మారినట్లు చెబుతున్నారు. తక్కువ ధరకు పత్తి దిగుమతి చేసుకుని తయారు చేయడంతో వారికి సానుకూలంగా మారినట్లు భావిస్తున్నారు.
