విధాత: ఎక్కడి నుంచి వచ్చాయో గాని ఒకేసారి మూడు ఎలుగుబంట్లు ఆలయంలోకి ప్రవేశించిన ఘటన వైరల్ గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీరిగేపల్లి గ్రామంలోని అమ్మాజీ ఆలయంలోకి మూడు ఎలుగుబంట్లు ప్రవేశించాయి. అర్థరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన ఎలుగుబంట్ల హల్ చల్ ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
అయితే ఎలుగుబంట్లు ఆలయంలో అటు ఇటు తిరుగుతున్న క్రమంలో సెన్సార్ సైరన్ మోగింది. సెన్సార్ సైరన్ మోత శబ్ధానికి ఎలుగుబంట్లు భయంతో పరుగులు తీశాయి. అదృష్టవశాత్తు ఎలుగుబంట్లు వచ్చిన సమయంలో ఆలయంలో భక్తులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఎలుగుబంట్లు ఆహారం వెతుక్కుంటూ సమీప అటవీ ప్రాంతం నుంచి ఆలయానికి వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఆలయంలో భక్తులు అమ్మవారికి నేవేధ్యంగా పెట్టిన పండ్లను తినేందుకు తరుచుగా ఎలుగుబంట్లు ఆలయానికి వస్తుంటాయని స్థానికులు తెలిపారు.