ISRO Satellite Images | విధాత : దైవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల ప్రకృతి చేసిన ప్రళయ గర్జనలు ఎలా ఉంటాయో దేశమంతా క్లౌడ్ బరెస్టుతో చూసింది. ఉత్తర కాశీ జిల్లాలో ఆకస్మికంగా కురిసి భారీ వర్షాల కారణంగా నిమిషాల వ్యవధిలో దూసుకొచ్చిన ఖీర్ గఢ్ నది వరద ఉదృతి ధరాళీ అనే గ్రామాన్ని ముంచెత్తడంతో దాదాపుగా ఆ గ్రామం బురదతో కూడిన వరదలలో కనుమరుగైంది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.. వరదల కారణంగా నలుగురు మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. ఆర్మీ బేస్ కొట్టుకపోవడంతో 10మంది సైనికులు కూడా గల్లంతయ్యారు. ధరాళీ గ్రామంపై జల ప్రళయాన్ని తలపించిన భారీ వరదల భీభత్సంపై ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపాయి.
గత ఏడాది జూన్13న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న ఆపిల్ తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
ధరాళీ గ్రామం నుంచి ప్రవహించే ఖీర్ గఢ్ అనే ఉపనది ప్రవాహ ఉదృతితో అక్కడి రహదారులు, వంతెనలు మొత్తం కొట్టుకుపోయాయి. వరద ధాటికి నది మార్గం కూడా మారిపోయిన దృశ్యం ఇస్రో చిత్రంలో కనిపించింది. ధరాళీ గ్రామం విపత్తు హిమాలయాల ప్రాంతాల్లో జరుగుతున్న వాతావరణ మార్పులకు నిదర్శనంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా సిద్దం కావాలని సూచిస్తున్నారు. ఇప్పటిదాక సహాయక బృందాలు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రహదారులు, విద్యుత్తు పునరుద్ధరణ, అనుసంధానం పునులు చురుగ్గా సాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వ సహాయ పంపిణీ కొనసాగుతుంది.