Site icon vidhaatha

రాష్ట్రంలోని.. అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

విధాత, వరంగల్: గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ పేజ్ -3 ప్యాకేజ్ 3 లో భాగంగా ఏర్పాటుచేసిన నూతన మోటార్ల ద్వారా నీటి విడుదల కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా దేవన్నపేట టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు రాష్ట్ర మంత్రులు, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి చేరుకోగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సాగునీటి పారుదల శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

హెలిప్యాడ్ నుంచి దేవన్నపేట శివారులోని దేవాదుల పంపింగ్ స్టేషన్ కు మంత్రులు చేరుకొని సొరంగం తో పాటు మోటార్ యూనిట్లను మంత్రులు పరిశీలించారు. దేవాదుల నీటి పంపింగ్ ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే ఉన్న సాగునీటిపారుదల శాఖ అధికారులు, ఆస్ట్రియాకు చెందిన ఇంజనీర్ల బృందంతో మంత్రులు సమావేశమై నీటి పంపింగ్ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నారు. దేవాదుల పైపు ద్వారా రిజర్వాయర్ లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును అన్ని రకాలుగా పూర్తి చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మాట ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఫేజ్ లు, అన్ని లింకులు, అన్ని మోటార్లు, అన్ని పంపులను పూర్తి చేస్తామన్నారు. ఒక పంపును ఆన్ చేసి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలుగుతున్నామని అన్నారు. మరో రెండు పంపులను 15 రోజుల్లోగా ఆన్ చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాజవరంలోని పంపింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు.

మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గడచిన 15 నెలలలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం ప్రేమ, అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాలలో మీరు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

దేవాదుల మూడో దశకు సంబంధించి ప్రారంభించాలనుకున్నా మని, కొన్ని సాంకేతిక కారణాలవల్ల ఆలస్యం అయిందన్నారు. సుమారు 600 క్యూసెక్కుల నీటిని విడుదలవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను ఇందిరమ్మ ప్రభుత్వం మరింత సస్యశ్యామలం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సాగునీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version