Site icon vidhaatha

Revanth Reddy | సీఎంవో ప్ర‌క్షాళ‌న వెనుక మ‌త‌ల‌బేంటి?

హైద‌రాబాద్‌,  (విధాత‌): రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి పేషీలో స‌మూల‌న ప్ర‌క్షాళ‌న జ‌రుగుతోంది. ఈ ప్ర‌క్షాళ‌న వెన‌కాల ఉన్న మ‌త‌ల‌బు ఏంట‌నే చర్చ స‌చివాల‌యంలో విస్తృతంగా సాగుతున్నది. ఇద్ద‌రు అఖిల భార‌త స్థాయి అధికారులను బ‌దిలీ చేయ‌గా, మ‌రో ఇద్ద‌రు అధికారుల‌ను తాజాగా నియ‌మించారు. ఇద్ద‌రిలో ఒక‌రు రిటైర్ అయిన అఖిల భార‌త స్థాయి అధికారి కావ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఏడాదిన్న‌ర త‌రువాత బ‌దిలీలు మొద‌ల‌య్యాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఒక‌రి త‌రువాత ఒక‌రిని బ‌దిలీ చేస్తుండ‌టంతో ఏం జ‌రుగుతోందంటూ స‌చివాల‌యం ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు. తొలుత సంయుక్త‌ కార్య‌ద‌ర్శి ఎస్‌ సంగీత స‌త్యానారాయ‌ణను నాలుగు రోజుల క్రితం ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ సంచాల‌కురాలిగా బ‌దిలీ చేశారు. ఆమె స్థానంలో కొత్త‌గా ఎవ‌రినీ నియ‌మించ‌లేదు.

ఆ త‌రువాత బుధ‌వారం నాడు కార్య‌ద‌ర్శి షాన‌వాజ్ ఖాసీ (ఐపీఎస్‌)ను తెలంగాణ డ్ర‌గ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్‌ డైరెక్ట‌ర్ జ‌న‌రల్‌గా బ‌దిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్త‌వానికి ఆయ‌న‌ను సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కాగా నాలుగు రోజుల క్రితం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేశ్‌ రంజ‌న్‌ను ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల కోసం నియ‌మించారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఇప్ప‌టికే ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న వీ శేషాద్రి క‌న్నా జ‌యేశ్‌ రంజ‌న్ చాలా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి. ఇద్ద‌రికీ వేర్వేరు బాధ్య‌త‌లు అప్ప‌గించారుని, ఒక‌రితో మ‌రొక‌రికి సంబంధం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే జ‌యేశ్‌ చూస్తార‌ని, మిగ‌తా అంశాల‌లో ఆయ‌న జోక్యం కానీ ఆదేశాల జారీ కానీ ఉండబోవని అంటున్నాయి. ఎప్ప‌టిమాదిరే శేషాద్రి త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను రోజువారీ ప‌ర్య‌వేక్షిస్తార‌ని అంటున్నారు.

ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న మ‌రో కార్య‌ద‌ర్శి ఎం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి (ఐఎఫ్ఎస్) కూడా తెలంగాణ‌ స‌మాచార హ‌క్కు ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా నియమిస్తారని తెలుస్తున్నది. సెలక్ష‌న్ క‌మిటీ ప్ర‌ధాన కమిష‌న‌ర్‌తోపాటు క‌మిష‌న‌ర్ల ప‌ద‌వుల భ‌ర్తీ కోసం రాజ్ భ‌వ‌న్‌కు సిఫార‌సు చేసినట్టు తెలిసింది. నేడో రేపో ఉత్త‌ర్వులు జారీ అవుతాయ‌ని స‌మాచారం. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నియామ‌కం ఉత్త‌ర్వులు జారీ అయిన త‌రువాత ఆయ‌న స్థానంలో మ‌రో అధికారిని నియ‌మిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దీంతో మొత్తం ముఖ్య‌మంత్రి కార్యాల‌యం పేషీ నుంచి న‌లుగురు అధికారుల‌ను బ‌దిలీ లేదా స్థానం చ‌ల‌నం జ‌రిగింది. అయితే ఈ బ‌దిలీల వెన‌కాల ఉన్న మ‌త‌ల‌బేంటి అనే చ‌ర్చ స‌చివాల‌యంలో న‌లుగురు ఉద్యోగులు క‌లిసిన చోట చ‌ర్చించుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి త‌న స్పీడ్‌కు అనుగుణంగా ప‌నిచేయ‌డం లేద‌ని బదిలీ చేశారా? లీకుల కోణం ఏమైనా ఉందా? అనేది తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌కు సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌లు

స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ (వీఆర్ఎస్‌) తీసుకున్న ఐఏఎస్ అధికారి కేఎస్‌ శ్రీనివాస రాజును ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ముఖ్య కార్య‌ద‌ర్శిగా నియమిస్తూ బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుడిగా నియ‌మితుల‌య్యారు. అంతకు ముందు రాజు ఏపీలోని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నించారని సమాచారం. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ఈవోగా శ్యామ‌ల రావును నియ‌మించ‌డంతో రాజు గ‌తేడాది జూన్ నెల‌లో స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం, ఆమోదం పొందడం జరిగిపోయాయి. ఆ వెంట‌నే తెలంగాణ‌లో స‌ల‌హాదారుడిగా నియ‌మితులు అయ్యారు. ఆయ‌న‌కు ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ముఖ్య కార్య‌ద‌ర్శిగా నియ‌మించాల‌ని రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం ముఖ్య కార్య‌ద‌ర్శిగా వీ శేషాద్రి ప‌నిచేస్తున్నారు. శేషాద్రి 1999 ఐఏఎస్ బ్యాచ్ అధికారి కాగా.. శ్రీనివాస్ రాజు 2001 బ్యాచ్‌. రాజు రెండేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారంటూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అట‌వీ శాఖ ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్‌) గా పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను సీ సువ‌ర్ణకు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర‌ణ్య భ‌వ‌న్ లో బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ‌పై వెళ్తున్న‌ పీసీసీఎఫ్ రాకేశ్‌ మోహ‌న్‌ డోబ్రియాల్ నుంచి ఆమె బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ ప‌ద‌వికి సీఎంవోలో కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ఎం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని నియ‌మిస్తార‌నే ప్ర‌చారం అంతకు ముందు జ‌రిగింది.

Exit mobile version