Telangana| Congress| Brs
విధాత: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. తులం బంగారం, మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి 420 హామీల అమలు అప్పులమయమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరకాటంగా తయారయ్యాయి. ప్రాధాన్యతలను..బడ్జెట్ ను అనుసరించి ఒక్కో హామీలు అమలు చేస్తున్నప్పటికి చాల వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలో 18ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీ సైతం పెండింగ్ లో ఉండిపోయింది.
ప్రస్తుతం శాసన సభ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ రోజుకో రీతిలో నిరసన తెలుపుతోంది. మంగళవారం మండలి సభ్యులు స్కూటీల హమీ అమలు ఎప్పుడంటూ నిరసన ప్రదర్శన చేశారు. స్కూటీ కటౌట్లతో మండలి ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వినూత్న నిరసన ప్రదర్శన ఆకట్టుకుంది. స్కూటీలు ఎక్కడంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు ఉన్నారు.