యుద్ధంలో బ‌ల‌వుతున్న నిజాలు.. బ‌య‌ట‌పెట్టిన బూమ్ నిజ‌నిర్ధార‌ణ సంస్థ‌

  • Publish Date - October 16, 2023 / 12:49 PM IST
  • కుప్ప‌లు తెప్ప‌లుగా త‌ప్పుడు వీడియోలు
  • పాల‌స్తీనాకు వ్య‌తిరేకంగా భారీగా పోస్టులు
  • భార‌త‌ మూలాలున్న ఖాతాల నుంచే ఎక్కువ‌


న్యూఢిల్లీ : యుద్ధంలో మొద‌టి బ‌లిప‌శువు ‘నిజం’ అని సామెత‌! నిజం నిద్ర‌లేచే స‌మ‌యానికి అబ‌ద్ధం లోకాన్ని చుట్టేస్తుంద‌నే మ‌రో సామెత కూడా ఉన్న‌ది. ఇప్పుడు ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళాలు, హ‌మాస్ తీవ్ర‌వాదుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంలోనూ ఈ సామెత‌లు నిజ‌మ‌వుతున్నాయి. అందుకు అనేక ఉదంతాలు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. అందులోనూ ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో ‘నిజాలు’ దారుణ హ‌త్య‌కు గుర‌వుతున్నాయి. ఆ స్థానంలో అవాస్త‌వాలు కుప్ప‌లు తెప్ప‌లుగా ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను క‌లుషితం చేస్తున్నాయి. అక్టోబ‌ర్ 7వ తేదీన ద‌క్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్ర‌వాదులు చేసిన దాడుల అనంత‌రం ఇవి మ‌రింత చెల‌రేగిపోతున్నాయి.


ఆందోళ‌న క‌లిగించే అంశం ఏమిటంటే.. ఈ యుద్ధంలో పాల‌స్తీనా వ్య‌తిరేక త‌ప్పుడు ప్ర‌చారం అత్య‌ధికంగా జ‌రుగుతున్న దేశాల్లో భార‌త‌దేశం ముందుభాగాన ఉండ‌టం! యూదు బాలుడిని హ‌మాస్ తీవ్ర‌వాదులు కిడ్నాప్ చేశార‌ని, ఒక కుర్రాడిని ట్ర‌క్కులో ప‌డేసి త‌ల న‌రికేశార‌ని సామాజిక మాధ్య‌మాల్లో కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి. ఎక్స్‌గా పేరు మారిన ట్విట్ట‌ర్‌లో బ్లూచెక్ ఖాతాల నుంచీ ఇటువంటి త‌ప్పుడు వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆఖ‌రుకు హ‌మాస్ దాడి వెనుక అమెరికా ఉన్న‌ద‌ని పేర్కొంటున్న ఒక ట్వీట్‌ను సైతం వేల మంది షేర్ చేశారు.


భార‌త‌దేశంలోని ప్ర‌ముఖ‌ నిజ‌నిర్ధార‌ణ స‌ర్వీసుల సంస్థ‌ల్లో బూమ్ ఒక‌టి. పాల‌స్తీనా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి త‌ప్పుడు ప్ర‌చారాల‌పై ఈ సంస్థ ప‌రిశోధ‌న చేసింది. భార‌త‌దేశానికి చెందిన ఎక్స్ యూజ‌ర్లు పెద్ద సంఖ్య‌లో త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్న‌ట్టు ఈ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంద‌ని అల్‌జజీరా వెబ్‌సైట్ పేర్కొన్న‌ది. పాల‌స్తీనాకు వ్య‌తిరేకంగానో, లేదా ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగానో.. త‌ప్పుడు స‌మాచారాల‌ను.. య‌థేచ్ఛ‌గా షేర్ చేస్తున్నార‌ని బూమ్ సంస్థ తేల్చింది. పాల‌స్తీనియ‌న్లు ప్రాథ‌మికంగా క్రూర‌మైన‌వార‌నే భావ‌న చొప్పించేలా వారి ప్ర‌య‌త్నాలు ఉంటున్నాయ‌ని పేర్కొన్న‌ది.


ప‌దుల సంఖ్య‌లో బాలిక‌ల‌ను పాల‌స్తీనియ‌న్ ఫైట‌ర్లు లైంగిక బానిస‌లుగా తీసుకుపోయార‌ని ఒక వీడియో స‌ర్క్యులేట్ చేశారు. నిజానికి ఆ వీడియో.. జెరూస‌లెంకు జ‌రిగిన ఒక స్కూలు ట్రిప్‌. త‌క్కువ క్వాలిటీ ఉన్న ఆ వీడియోను గ‌మ‌నిస్తే.. ఆ బాలిక‌లు త‌మ ఫోన్ల‌ను ఉప‌యోగించుకుంటూ, సంతోషంగా ముచ్చట్లు చెప్పుకొంటున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇంత స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. వేల మంది ఈ వీడియోను షేర్ చేసిప‌డేశారు.


అంతేకాదు.. దానికి దాదాపు 60 ల‌క్ష‌లకుపైగా ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయి. ఈ వీడియోను షేర్ చేసిన ఖాతాల‌ను విశ్లేషిస్తే.. వాటిలో సింహ‌భాగం భారత్‌కు చెందిన‌వేన‌ని తేలుతున్న‌ద‌ని బూమ్ పేర్కొంది. ఇదే వీడియోను యాంగ్రీ శాఫ్రాన్ అనే టెలిగ్రామ్ చాన‌ల్‌లో కూడా షేర్ చేశారు. ఇది ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ లేదా ఓఎస్ఐఎన్‌టీ చాన‌ల్‌గా చెబుతున్నారు. ఇది ఇండియా నుంచే ఆప‌రేట్ అవుతున్న‌ది.



త‌ప్పుడు వీడియోల‌తో విద్వేష య‌త్నాలు


హ‌మాస్ తీవ్ర‌వాదులు ఒక యూదు బాలుడిని కిడ్నాప్ చేశార‌ని చెబుతూ ఒక వీడియో ఇలానే స‌ర్క్యులేట్ అవుతున్న‌ది. ఈ వీడియోను ఒక్క‌ పోస్టింగ్‌లోనే దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది చూశారు. దీనిని షేర్ చేసిన టాప్ టెన్ ఖాతాల్లో ఏడు భార‌తీయ ప్రొఫైల్ క‌లిగిన‌వో, దేశ ప‌తాకాన్ని క‌లిగిన‌వోన‌ని అల్‌జ‌జీరా పేర్కొన్న‌ది. ఈ ఏడు ట్వీట్‌ల‌కు దాదాపు 30 ల‌క్ష‌ల ఇంప్రెష‌న్లు వ‌చ్చాయి. దీనిలో వాస్త‌వాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ వీడియో సెప్టెంబ‌ర్ నాటిది. కిడ్నాప్‌తో లేదా గాజాతో సంబంధం లేనిద‌ని తేలింది. ఇటువంటి అవాస్త‌వ వీడియోల‌ను ప్ర‌చారంలో పెడుతున్న‌వారు ముస్లిం వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డానికి త‌మ అత్య‌ధిక స‌మ‌యాన్ని వెచ్చిస్తున్న‌ట్టు తేలింది.


బాలుడి త‌ల న‌రికేశార‌న్నత‌ప్పుడు వీడియోను పోస్ట్ చేసిన ఒక వ్య‌క్తి.. దానికి ఇస్లామే స‌మ‌స్య అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. బాలిక‌ల‌ను లైంగిక బానిస‌లుగా ప‌ట్టుకుపోతున్నారంటూ మ‌రో త‌ప్పుడు వీడియోను షేర్ చేసిన ఒక వ్య‌క్తి.. గ‌తంలో ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ.. ముస్లిం బాలిక‌లు హిందూమ‌తం స్వీక‌రించిన త‌ర్వాత ఇలా సంతోషంగా ఉంటార‌ని, అదే హిందూ బాలిక‌లు ముస్లిం మ‌తం స్వీక‌రిస్తే సూట్‌కేసులోనో, ఫ్రిజ్‌లోనో ఉంటార‌ని రాశాడు. కొంత‌మంది పాల‌స్తీనాపై మ‌రింత విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సైనికుడిన‌ని చెప్పుకొన్న ఒక‌ వ్య‌క్తి.. పాల‌స్తీనాను ఈ భూమండ‌లంపై నుంచే ఇజ్రాయెల్ పూర్తిగా తుడిచిపెట్టేయాల‌న్నాడు.


బీజేపీ ప్ర‌భుత్వంలో పెరిగిన విద్వేష ప్ర‌చారాలు


దేశంలో మోదీ నాయ‌క‌త్వంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి దేశంలో విద్వేష ప్ర‌చారాలు బాగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేకించి ముస్లిం వ్య‌తిరేక‌త‌ను బీజేపీ శ్రేణులు రెచ్చ‌గొడుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో అవి మ‌రింత పెరిగాయి. ఇస్లాం వ్య‌తిరేక ట్వీట్ల‌లో మెజారిటీ మూలాలు భార‌త‌దేశంలోనే క‌నిపిస్తున్నాయ‌ని ఆస్ట్రేలియాకు చెందిన ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ విక్టోరియా నివేదిక పేర్కొంటున్న‌ది. బీజేపీ ఐటీ సెల్ ఇటువంటి వాటిని విప‌రీతంగా షేర్ చేస్తున్న‌ద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


గ‌తంలో స్వాతి చ‌తుర్వేది అనే మ‌హిళ‌.. ఐ యామ్ ఏ ట్రోల్ అనే పుస్త‌కం రాశారు. అందులో బీజేపీ సోష‌ల్ మీడియా ఆర్మీ గురించి వివ‌రించారు. బీజేపీకి కొంత‌మంది వ‌లంటీర్ల‌తో కూడిన నెట్‌వ‌ర్క్ ఉంటుంద‌ని, వారు సోష‌ల్ మీడియా సెల్ నుంచి, రెండు అనుబంధ సంఘాల నుంచి వ‌చ్చే సూచ‌న‌ల మేర‌కు.. వాటిని విమ‌ర్శించే వారిని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెడుతార‌ని స్వాతి ఇంట‌ర్వ్యూ చేసిన సాధ్వి ఖోస్లా చెప్పారు. మ‌హిళా ద్వేషం, ఇస్లాం వ్య‌తిరేక‌త‌, విద్వేష ప్ర‌చారాలు చేయ‌లేక విసిగిపోయి తాను ఐటీ సెల్ నుంచి త‌ప్పుకొన్నాన‌ని ఆమె పేర్కొన్నారు.


దుష్ప్ర‌చారాల రాజ‌ధానిగా భార‌త్‌!


భార‌త‌దేశానికి చెందిన లాభాపేక్ష‌లేని నిజ‌నిర్ధార‌ణ వెబ్‌సైట్ ఆల్ట్‌న్యూస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌తీక్ సిన్హా ఒక ట్వీట్ చేస్తూ.. ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఎత్తిపోస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌ను గ‌మ‌నిస్తే.. దుష్ప్ర‌చారాల‌కు భార‌త‌దేశాన్ని రాజ‌ధానిగా దేశంలోని మిత‌వాద శ‌క్తులు ఎలా మార్చాయో ప్ర‌పంచం అర్థం చేసుకోగ‌ల‌దు.. అని పేర్కొన్నారు.