Site icon vidhaatha

గొర్రెల స్కామ్‌లో … ఈడీ విచారణ

రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులు
కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు : రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

విధాత : తెలంగాణలో గొర్రెల పంపిణీ పధకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద స్కామ్‌పై విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఎండీకి ఈడీ జోనల్ ఆఫీసు నోటీసులు ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ఏసీబీ ఇప్పటికే విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. అరెస్టై జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌లను మూడు రోజల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. విచారణలో నిందితులు నోరు మెదపలేదు. కస్టడీ గడువు ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే గొర్రెల కొనుగోలు పేరుతో రీస్లైకింగ్ చేసి , విక్రయ దారుల ఖాతాల్లో కాకుండా ఇతర బినామీల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్లుగా గుర్తించింని. ఇప్పుడీ వ్యవహారంలో అకస్మాత్తుగా ఈడీ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. మనీలాండరింగ్ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్దిదారుల పేర్లు, వారి అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్దిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి విధులిచ్చారనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఈడి కోరింది.

కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు
గొర్రెల స్కామ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది, విచారణ కోసం ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తన సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండుగ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అయితే రఘునందన్‌రావు చెప్పినట్లుగా ఈడీ అధికారులు కేసీఆర్‌పై కేసు నమోదు చేసినట్లుగా అధికారికంగా ప్రస్తుతానికైతే ఈడీ వెల్లడించలేదు.

Exit mobile version