కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి చంద్రబాబు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. చంద్రబాబు అన్ని రంగాలవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అముల చేస్తున్నారని, రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
చంద్రబాబు పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఆయన ఏదీ చేయడంలేదని వైసీపీ తలుపు తడుతున్నారని జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని తెలిసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. అందుకే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు మాట పోలీసులు వినకపోతే డీజీపీ స్థాయి అధికారులపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహించారు. సీఎం మాట వినని పోలీసుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతిలాల్ రాణ టాటా, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలపై మోపిన అక్రమ కేసులే నిదర్శనమన్నారు.
కూటమి ప్రభుత్వంలో దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ ఛైర్ పర్సన్ బీసీ నాయకురాలు హారికపై టీడీపీ సైకోలు కర్రలు, రాళ్లతో దాడి చేశారన్నారు. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో కార్యక్రమానికి వెళ్తుంటే ఆమెను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ, కొడుతూ, కారు అద్దాలను ధ్వంసం చేశారని, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు ప్రేక్షకపాత్ర పోషించారని ధ్వజమెత్తారు. ఇలా ప్రశ్నిస్తున్నవారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూనే ఉందన్నారు.
సినిమాలోని డైలాగులు పోస్టర్లుగా ప్రదర్శించినందుకు ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. చంద్రబాబుకు ఆ డైలాగ్ నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి వాటిని తీసేయొచ్చుకదా అని ప్రశ్నించారు. నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లోని డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయన్నారు.
సినిమా డైలాగులు ప్రదర్శిస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో 131 మందికి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ సంప్రదాయాన్ని రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వేసిన విత్తనం రేపు వృక్షమై పోతుందన్నారు. ఈ రోజు దెబ్బతిన్నవారు రేపు మీము చెప్పినా వినకపోవచ్చని జగన్ అన్నారు. ఇకనైనా ఈ పద్దతిని మానేస్తే మంచిదని సూచించారు. సూపర్ సిక్స్ హామీల అమలు చేయలేకపోవడంతోనే, చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదని విమర్శించారు.
ఇకపోతే చంద్రబాబు 14 నెలల్లోనే రూ. 1,75,112 కోట్లు అప్పు తెచ్చాడని, అయినా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. 5ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 3,32,671 కోట్లు అప్పు చేసిందని, అప్పుడు రెండేళ్లు కరోనా ఉందని, అయినా అన్న పథకాలు అమలు చేశామన్నారు. ఏదేమైనా ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతామని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారిని ఎవరినీ వదలం, వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.