KCR Urgent Meet at Farmhouse | విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నేడో రేపో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందన మేరకు అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై కేసీఆర్ చర్చించేందుకు ఈ అత్యవసర భేటీ నిర్వహించినట్లుగా సమాచారం. ఈ భేటీలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జి.జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ రవీందర్ రావులు పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, సీఎం రమేశ్ వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సుధీర్ఘ విచారణ చేసి తుది నివేదిక సిద్ధం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023ఆక్టోబర్ 21న కుంగిన నేపథ్యంలో విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. 115మంది సాక్షులను విచారించి న్యాయ సవాళ్లకు నిలిచేలా తుది నివేదికను రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 31న జస్టిస్ ఘోష్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందనుందని సమాచారం.