Komatireddy Brothers | విధాత : సీఎం రేవంత్ రెడ్డి పట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన తమ్ముడు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుసరిస్తున్న విభిన్న వైఖరులపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఓ వైపు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిపై ఛాన్స్ దొరికితే చాలు తన అసంతృప్తిని బాహటంగానే వెళ్లగక్కుతుంటే..అన్న వెంకట్ రెడ్డి మాత్రం రేవంత్ భజన చేస్తున్నారు. సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పట్ల అన్నదమ్ములిద్ధరూ విభిన్న వైఖరిని ప్రదర్శిస్తున్న తీరుతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒకే రోజున తమ్ముడు విమర్శిస్తే..అన్న నెత్తికెత్తుకోవడం చూసి సహచర జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు.
ఇటీవల నేనే పదేళ్లు సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన రాజగోపాల్ రెడ్డి…తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను తప్పుబడుతూ ఎక్స్ వేదికగా సోమవారం మరోసారి విమర్శలు చేశారు.
ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ మీరు మళ్లీ సీఎం కావాలని..తెలంగాణ రైజింగ్ విజయవంతంగా కొనసాగాలని గణపతి పూజ..హోమం జరిపించానంటూ చెప్పాడం వైరల్ గా మారింది. రేవంత్, వెంకట్ రెడ్డిల ఫోన్ సంబాషణను సహచర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసక్తిగా విన్నారు
ఈ నేపథ్యంలో ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డిని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తిడుతుండటం..అన్న వెంకట్ రెడ్డి పొగుతుండటాన్ని ఏ రకంగా అర్దం చేసుకోవాలో తెలియక సొంత పార్టీ ఎమ్మెల్యేలు బ్రదర్స్ వ్యవహారంతో తలలు పట్టుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన సీఎం రేవంత రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని..అన్న వెంకట్ రెడ్డికి మంత్రి పదవి కొనసాగిస్తున్నందునా ఆయన సీఎం కోసం పూజలు చేస్తున్నారని…ఇందులో వింతేముందని ప్రతిపక్షాలు కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై సెటైర్లు వేస్తున్నాయి.