Site icon vidhaatha

రాజగోపాల్ నోటికి తాళం పడేనా? క్రమశిక్షణ సంఘం నెక్స్ట్ స్టెప్ ఏంటి?

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 16 (విధాత) : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వం, పార్టీపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని హస్తం పార్టీ డిసైడ్ అయింది. రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించాలని క్రమశిక్షణ సంఘాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈ విషయమై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం రంగంలోకి దిగనుంది. రెండు మూడు రోజుల్లో సమావేశమై చర్చించనుంది. ఏ సందర్భంలో రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేయాల్సివచ్చిందో ఆయన నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. ఈ వివరణ ఆధారంగా ఏం చేయాలనే దానిపై నాయకత్వం నెక్స్ట్ స్టెప్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జూన్‌లో మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి సమయం దొరికితే చాలు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు తానే సీఎం అన్న రేవంత్‌ రెడ్డి ప్రకటనను ఖండించారు. సోషల్ మీడియా, జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి పదవి ఇవ్వలేదు.. కనీసం తన నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వరా అంటూ ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలను ఆపడం లేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘానికి సిఫారసు చేశారు పీసీసీ చీఫ్.

ఆలస్యంగా స్పందించారా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ నాయత్వం చూసీ చూడనట్టు వ్యవహరించిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. అంతకు ముందు మంత్రి సురేఖ, మురళి దంపతుల వ్యవహారాన్ని చల్లార్చినట్టు చేశారు. ఆయన వివరణ తీసుకుని, మురళిపై ఎలాంటి చర్యలు ఉండవని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సంకేతాలు ఇచ్చింది. అంతకుముందే బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాయి. క్రమశిక్షణ సంఘం నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొండా మురళి, తీన్మార్ మల్లన్న విషయంలో స్పందించినట్టుగా రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం స్పందించలేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.

రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?
విస్తరణ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఎవరిపై ఏం మాట్లాడారనే దానిపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం వీడియో పుటేజీని తీయనుందని సమాచారం. ఐదుసార్లు రాజగోపాల్ రెడ్డి సీఎంతో పాటు కాంగ్రెస్ పై విమర్శలు చేశారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన ఫుటేజీ, వార్తల కవరేజీ కూడా క్రమశిక్షణ సంఘం పరిశీలించనుంది. వీటి ఆధారంగా రాజగోపాల్ రెడ్డి వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇవ్వడానికి కూడా రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నారని తెలుస్తున్నది. తాను సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని అంటూనే తన అసంతృప్తిని ఆయన బయటపెడుతున్నారు. క్రమశిక్షణ సంఘం రాజగోపాల్ రెడ్డిని ఏం అడుగనుంది, దానికి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి సమాధానం చెబుతారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అవసరమైతే మళ్లీ రాజీనామా చేస్తానని ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి బెదిరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకొనే సాహసం నాయత్వం చేస్తుందా? అనే చర్చ కూడా లేకపోలేదు.

Exit mobile version