Site icon vidhaatha

CM Revanth Reddy | రేవంత్ రెడ్డి: లోకేశ్‌తో కేటీఆర్‌ సీక్రెట్‌ మీట్‌ ఎందుకు?

Revanth-reddy-ktr-nara-lokesh

CM Revanth Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీ ఐటీ మంత్రి లోకేశ్‌ను కేటీఆర్ ఎందుకు రహస్యంగా కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్‌ను అర్ధరాత్రి అంత సీక్రెట్‌గా కలవాల్సిన అవసరమేముందో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటి సీఎం కేజ్రీవాల్ చివరి దశలో అరెస్టు అయ్యారన్న రేవంత్‌.. విలన్ల సంగతి చివరి దశలోనే తేలుతుందని సెటైర్లు వేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో కేసీఆర్ కుటుంబ సభ్యులే చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఈడీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా ఇతర అంశాలను సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలనే డిమాండ్ ద్వారా కేసీఆర్‌ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా ఈ కారు రేస్, కాళేశ్వరం సహా అన్ని అంశాలపై దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు.

పొరుగు రాష్ట్రాలతో చర్చలతోనే పరిష్కారాలు

పక్క రాష్ట్రాలతో సమస్యలు ఎక్కువైతే తమ పార్టీని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. పార్టీ పేరులో తెలంగాణ అని తొలగించుకున్నవారికి తనను జై తెలంగాణ అని అనాలని కోరుకొనే హక్కులేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే సీఎంల స్థాయిలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బేసిన్ అవసరాలు తీరకుండా బేసిన్ లోని ఇతర ప్రాంతాలకు నీళ్లివ్వడానికి తాను కేసీఆర్ ను కాదని సెటైర్లు వేశారు. నదీ జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. నీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్రం పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా? అని రేవంత్‌ ప్రశ్నించారు. దుబాయ్‌లో డ్రగ్స్ తీసుకొని చనిపోయిన కేటీఆర్ స్నేహితుడి ఫోరెన్సిక్ రిపోర్టులు తెప్పించినట్టు చెప్పారు. కేటీఆర్‌ను కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో ఉన్న అడ్డంకులను అధిగమించి ముందకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించిందే కేసీఆర్ అని సీఎం విమర్శించారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

వాళ్లు మాట్లాడొచ్చు.. నేను మాట్లాడకూడదా?

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు, జగన్ లతో మాట్లాడారని.. తాను కూడా మాట్లాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ కేంద్ర ముఖ్యులను కలుస్తున్నానని ఆయన చెప్పారు. కేసీఆర్ తో సహా ఎవరైనా తనకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప… శత్రువులుగా చూడడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version