విధాత: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో(Bihar Assembly Elections) తాను పోటీ చేయడం లేదని జన సురాజ్ పార్టీ(Jan Suraaj Party) అధినేత ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల్లో పనిచేస్తానని.. తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. పార్టీ నిర్ణయానికి నేను నేను కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించాం. ఒకవేళ నేను పోటీలో ఉంటే.. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లే అవకాశం ఉంది అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
హంగ్ రాదు..మాకే మెజార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ విజయం సాధించి దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడబోదని..అది అసాధ్యమని స్పష్టం చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పార్టీ జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అన్నారు. ఎన్డీయేకు ఓటమి తప్పదని.. నీతీశ్ కుమార్ మళ్లీ సీఎం కాలేరు అని పీకే తెలిపారు. ఇండియా కూటమి పరిస్థితి కూడా అంతగా మెరుగ్గా లేదు. కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి అని పీకే అభిప్రాయపడ్డారు. జనసురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.