Site icon vidhaatha

వైఎస్.జగన్ : కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదుకు యాప్

ys-jagan-bringing-ycp-new-app-for-complaints-on-nda-government-harassments

విత్తిన పంటనే వస్తుంది
అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాం
చంద్రబాబు మోసగించారని జనంలో ఆగ్రహం
వైసీపీని దూరం చేసుకుని తప్పుచేశామని మధనం
బాబు బిర్యానీ కోసం ఆశపడితే వైసీపీ పలావ్ పోయింది

అమరావతి : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై సాగిస్తున్న వేధింపుల ఘటనల నమోదు కోసం పది రోజుల్లో ఓ యాప్ తీసుకరాబోతున్నామని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ వెల్లడించారు. వైసీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్‌ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే…రాబోయే రోజుల్లో టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు సంబంధిచి తీసుకురానున్న యాప్ లోకి వెళ్లి బాధితులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు..వేధింపులకు పాల్పడిన అధికారుల వివరాలు..ఆధారాలు..ఎవరి ప్రోద్భలంతో వారు వైసీపీ శ్రేణులకు అన్యాయం చేశారన్నదానిపై వాటిలో వివరాలు నమోదు చేయవచ్చన్నారు. ఆ వివరాలన్ని పార్టీ డిజిటల్ సర్వర్ కు అందుతాయన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాతా వాటిని ఓపెన్ చేసి..ఎవరైతే మన కార్యకర్తలకు అన్యాయం చేశారో..వారందరిని చట్టం ముందు నిలబెట్టి..వారందరికి సినిమా చూపిస్తామన్నారు. వారు చేసిన వేధింపులకు చక్ర వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఏదైతే విత్తుతున్నామో..అదే రేపు పండుతుందన్నారు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు ఏజెంట్లుగా మారి అధికార పార్టీ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. మిధున్ రెడ్డి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై నమోదైన కేసులను గుర్తు చేశారు.

పీఏసీ సభ్యులు క్రీయాశీకలంగా వ్యవహరించాలి

బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ఫోగ్రామ్ ను వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ఉద్ధృతంగా చేసేందుకు పీఏసీ సభ్యులు క్రీయాశీకలంగా పనిచేయాలని జగన్ ఆదేశించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలన్నారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదని వివరించాలని తెలిపారు. ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడని.. ఏ కొత్త పథకం..స్కీమూ లేదని.. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్‌ పర్యటన అని జగన్ విమర్శించారు. ప్రతిచోట చంద్రబాబు చేసిన మోసం జనానికి అర్ధమవుతుందని..వైసీపీని దూరం చేసుకుని తప్పు చేశామన్న భావన జనంలో వ్యక్తమవుతుందన్నారు. చంద్రబాబు బిర్యానీకి ఆశపడితే బిర్యానీ లేకపోగా..ఉన్న వైసీపీ పలావ్ కూడా పోయిందన్న భావనతో ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను ఉదృతం చేయాలన్నారు. వైసీపీ గ్రామ కమిటీల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరిని కలుపుకుని ప్రజలతో మమేకమై పనిచేయాలని జగన్ సూచించారు.

Exit mobile version