Amazon LayOffs | అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్.. కంపెనీ చరిత్రలోనే..!

అమెజాన్‌లో ముగింపు లేని లేఆఫ్స్! వచ్చే వారం మరో 16,000 మందిపై వేటు. కంపెనీ చరిత్రలోనే ఇది అతిపెద్ద తొలగింపు. ఏఐ ప్రభావమే కారణమా?

Amazon LayOffs

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. అమెజాన్‌ రానున్న నెలల్లో దాదాపు 30,000 ఉద్యోగులపై కోత వేయనున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లో రాయిటర్స్‌ వార్తాపత్రిక నివేదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతలో 14 వేల మందిపై సంస్థ ఇప్పటికే వేటు వేసింది. ఇప్పుడు రెండో విడత లేఆఫ్స్‌కు (mass layoffs) సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి కూడా దాదాపు 16,000 మందిని తొలగించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే వారం నుంచే ఉద్యోగ కోతలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం నుంచే..

2025 అక్టోబరు నెలలో అమెజాన్ సుమారు 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో ప్రకటించిన 30,000 ఉద్యోగాల కోత లక్ష్యంలో ఇది సగం మాత్రమే. ఇప్పుడు మిగతా సగం సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు రెఢీ అయ్యింది. గతంలో లేఆఫ్స్‌కు గురైన వారికి కల్పించిన 90 రోజుల గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో మంగళవారం నుంచే కొత్త లేఆఫ్స్ ప్రక్రియ మొదలుకావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జనవరి 27 నుంచి 16,000 మంది ఉద్యోగులపై టెక్‌ దిగ్గజం వేటు వేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

ఈ విభాగాలపై ప్రభావం..

తాజా సమాచారం ప్రకారం.. ఈ లేఆఫ్స్ ప్రభావం అమెజాన్‌లోని కీలక విభాగాలపై పడనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ (పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ) విభాగాలపై పడనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తాజా లేఆఫ్స్‌ పరిధి ఎంత వరకు ఉంటుంది అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనప్పటికీ కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తున్నది.

కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌ ఇదే

మొత్తం 30,000 ఉద్యోగాల కోత పూర్తయితే.. ఇది అమెజాన్ మూడు దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు అవుతుంది. 2022లో కంపెనీ సుమారు 27,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే. ఇది ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 15.8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వేర్‌హౌస్‌లు, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో పనిచేస్తున్నారు.

ఉద్యోగుల్లో లేఆఫ్స్‌ గుబులు

సంస్థ ఇలా ఎడాపెడా లేఆఫ్స్‌ ప్రకటిస్తుండటంతో ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోతోంది. ముఖ్యంగా టెకీల్లో లేఆఫ్స్‌ గుబులు మొదలైంది. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ ఆందోళనను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

KBR Park Signal-Free | కేబీఆర్ పార్క్ ఇక సిగ్నల్-ఫ్రీ కారిడార్: 6 ఫ్లైఓవర్లు, 6 అండర్‌పాస్‌ల నిర్మాణాలు షురూ!
Mushroom Farming | పుట్ట‌గొడుగుల సాగుతో.. నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఒడిశా రైతు

Latest News