Oneplus Nord CE 6 Lite | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. OnePlus Nord CE 6 Lite పేరుతో కొత్త ఫోన్ రాబోతున్నట్లు గీక్‌బెంచ్‌లో కనిపించింది. అలాగే దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. ఈ ఫోన్ Nord CE6తో కలిసి వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ప్రాసెసర్ వివరాలు
లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇందులో నాలుగు కోర్లు 2.6GHz, మరో నాలుగు కోర్లు 2.0GHz స్పీడ్‌తో పనిచేస్తాయి. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 GPU ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్లో 8GB ర్యామ్ ఉండొచ్చు. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
గీక్ బెంచ్ టెస్ట్‌లో ఈ ఫోన్ సింగిల్ కోర్లో 1068 పాయింట్లు, మల్టీ కోర్లో 2953 పాయింట్లు సాధించింది. దీంతో ఈ మొబైల్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మంచి పనితీరు అందించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫీచర్లు-కెమెరా
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఫొటోగ్రఫీ కోసం 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ధర ఎంత ఉండొచ్చు
బ్యాటరీపరంగా ఇది 7000mAh భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఇవ్వవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే 128జీబీ, 256జీబీ వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఫోన్ ధర 23వేలలోపే ఉండొచ్చని సమాచారం. ఆఫర్లతో ఇది రూ.20 వేలకే లభించే అవకాశం ఉంది.
గతంలో విడుదలైన Nord CE 4 Lite తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో ఈ లైట్ సిరీస్ మళ్లీ వస్తుండటం గమనార్హం. ప్రస్తుతం గీక్బెంచ్లోనే స్పెసిఫికేషన్లు లీకైనప్పటికీ.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
