Personal Finance Tips | బ్యాంక్ లోన్ క్లోజ్ చేశామని రిలాక్స్ అవుతున్నారా? ఈ 5 పత్రాలు తీసుకోకుంటే సమస్యలు తప్పవు!

చివరి ఈఎంఐ కట్టగానే బ్యాంకులో తీసుకున్న లోన్ క్లియర్ అయిపోయిందని చాలామంది రిలాక్స్ అయిపోతుంటారు. కానీ ఆ తర్వాతే కొన్ని అతి ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయని.. వాటిని పూర్తి చేసి 5 డాక్యుమెంట్లు తీసుకోకపోతే ఆర్థికంగా, న్యాయపరంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Personal Finance Tips | మనలో చాలామంది పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ వంటి లోన్స్ తీసుకుని ఈఎంఐలు కట్టేస్తారు. లాస్ట్ ఈఎంఐ చెల్లించగానే.. హమ్మయ్యా! లోన్ క్లియర్ అయిపోయిందని రిలాక్స్ అయిపోతుంటారు. కానీ చివరి కిస్తీ కట్టగానే మీ బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో కాకపోతే భవిష్యత్తులో ఆర్థికంగా, న్యాయపరంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది చివరి ఈఎంఐ కట్టగానే బ్యాంకు నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ సమయంలో తీసుకోవాల్సిన కీలక పత్రాలను గురించి పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యం కారణంగా లోన్ పూర్తిగా చెల్లించినప్పటికీ.. రికార్డుల్లో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ హిస్టరీలో లోన్ స్టేటస్ సరిగ్గా అప్‌డేట్ కాకపోతే భవిష్యత్తులో రుణాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. కొన్నిసార్లు లీగల్ నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తుంది. కాబట్టి లోన్ పూర్తి అయ్యాక కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవడం చాలా అవసరం.

బ్యాంక్ నుంచి తీసుకోవాల్సిన 5 పత్రాలు

1. లోన్ క్లోజర్ సర్టిఫికెట్

లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సిన పత్రాల్లో అతి ముఖ్యమైనది లోన్ క్లోజర్ సర్టిఫికెట్. ఇది మీ అప్పు పూర్తిగా ముగిసిందని బ్యాంక్ అధికారికంగా నిర్ధారించే డాక్యుమెంట్. దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు వచ్చినా మీరు సురక్షితంగా బయటపడవచ్చు.

2. No Dues Certificate

లోన్ క్లోజర్ సర్టిఫికెట్‌తో పాటు నో డ్యూ సర్టిఫికెట్ (NOC) కూడా చాలా కీలకం. మీరు బ్యాంక్‌కు ఎలాంటి బాకీ లేరని ఇది వెల్లడిస్తుంది. లీగల్ సమస్యలు వచ్చినప్పుడు ఈ సర్టిఫికెట్ అండగా ఉంటుంది.

3. ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి తీసుకోవాలి

హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ చెల్లించిన తర్వాత బ్యాంకు నుంచి వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. హోమ్ లోన్ అయితే సేల్ డీడ్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్.. వెహికిల్ లోన్ అయితే వాహనానికి సంబంధించిన పత్రాలు అన్ని తిరిగి వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. వీటిలో ఏవైనా మిస్సయితే భవిష్యత్తులో ప్రాపర్టీ లేదా వెహికల్ విక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతాయి.

4. ఫైనల్ రీపేమెంట్ స్టేట్‌మెంట్

ఫైనల్ రీపేమెంట్ స్టేట్‌మెంట్ తీసుకోవడం ద్వారా మీరు మొత్తం ఎంత చెల్లించారో స్పష్టమైన రికార్డు ఉంటుంది. లోన్ క్లోజ్ అయిపోతే ఈ స్టేట్‌మెంట్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పేమెంట్ చేసిన వెంటనే పూర్తి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. భవిష్యతుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

5. లోన్ రిమూవల్ లేదా హైపోతికేషన్ క్లోజర్

మీ లోన్ ఉన్నంత కాలం ఆస్తి లేదా వాహనంపై బ్యాంక్‌కు హక్కు ఉంటుంది. కాబట్టి చివరి ఈఎంఐ కట్టేసిన తర్వాత దాన్ని తొలగించాలి. హోమ్ లోన్ తీసుకున్నట్లయితే అది పూర్తి కాగానే రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాలి.. వెహికిల్ లోన్ అయితే ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లి లోన్ తొలగించుకోవాలి. అప్పుడే ఆ ఆస్తి లేదా వాహనంపై మీకు పూర్తి హక్కులు వస్తాయి.

మరికొన్ని ముఖ్య విషయాలు

* లోన్ క్లోజ్ అయిన తర్వాత ఈ 5 డాక్యుమెంట్లు తీసుకోవడంతో పాటు క్రెడిట్ రిపోర్టును కూడా చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చివరి ఈఎంఐ చెల్లించిన తర్వాత 30 నుంచి 45 రోజుల్లో క్రెడిట్ రిపోర్టులో లోన్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

* ఈఎంఐ చెల్లింపుల కోసం ఆన్ చేసిన ECS/Auto Debit మ్యాండేట్స్‌ను నిలిపివేయాలి.
* లోన్ తీసుకునే సమయంలో బ్యాంక్‌కు సబ్‌మిట్ చేసిన సెక్యూరిటీ చెక్కులను తిరిగి తీసుకోవాలి.
* డాక్యుమెంట్ డిజిటల్ కాపీలను కూడా సేవ్ చేసుకోవాలి.

Read More:

Cibil Score | మీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? స్కోర్‌ని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా..?

Personal Loan Vs Mortgage Loan | పర్సనల్ లోన్, తాకట్టు రుణం: మీ అవసరాలకు సరైన రుణాన్ని ఎలా ఎంచుకోవాలి?

 

Latest News