డీలిమిటేషన్‌పై ఫలించని ఎన్డీయే ఎత్తు.. లోక్‌సభలో వీగిపోయిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సవరణ బిల్లు..

డీలిమిటేషన్ తో ముడిపెట్టి తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయింది. 298 అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ సవరణ బిల్లు వీగిపోయింది. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. కానీ..  జ‌నాభా లెక్క‌ల ప్ర‌క్రియ, డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌తో దీనిని ముడిపెట్టి సవరణ బిల్లును ప్రతిపాదించడాన్ని ప్ర‌తిప‌క్షాలు ముకుమ్మ‌డిగా తిర‌స్క‌రించాయి. లోక్‌స‌భ‌లో రెండు రోజుల‌పాటు సుదీర్ఘ చ‌ర్చ అనంత‌రం శుక్ర‌వారం సాయంత్రం ఓటింగ్ నిర్వ‌హించారు. మొత్తం 489 మంది ఓటింగ్‌లో పాల్గొనగా..  బిల్లుకు మ‌ద్ద‌తుగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చినట్టు తొలుత డిస్ ప్లే చూపించింది. అయితే కొంతమంది సభ్యులు స్లిప్పుల ద్వారా ఓటేసేందుకు స్పీకర్ అనుమతించారు. దాంతో మొత్తం ఓటేసినవారి సంఖ్య 528గా నిలిచింది. ఆ స్లిప్పులను కూడా కలుపుకొంటే 298 అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. దీనితో మూడింట రెండు వంతుల మెజార్టీ సాధ్యం కాలేదు. ఫలితంగా బిల్లు వీగిపోయింది. కీలకమైన సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

నిజానికి లోక్ సభలో ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 540 ఉండగా..రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ మేరకు బిల్లు ఆమోదానికి 360మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ బలం 293కాగా..ప్రతిపక్షాల బలం 233గా ఉంది. బిల్లుకు ఓటింగ్ ప్రక్రియలో 528మంది మాత్రమే పాల్గొన్నారు. బిల్లు ఆమోదానికి 352 మంది సభ్యుల మద్దతు లభించాల్సి ఉండగా… 298మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో మహిళా రిజర్వేషన్‌ మాటున డీలిమిటేషన్‌కు కేంద్ర ప్రభుత్వం వేసిన ఎత్తులు చిత్తయ్యాయి.

అంత‌కు ముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, మహిళా సాధికారికతను సాధ్యం చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం 131రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు ఆయన లోక్ సభలో సమాధానం ఇచ్చారు. సభలో అన్ని పార్టీలు వాదనలు వినిపించాయని, మూడు బిల్లులపై సమగ్ర చర్చ జరిగిందని, సభలో 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారు అని గుర్తు చేశారు. బిల్లుపై 56 మంది మహిళ ఎంపీలు మాట్లాడారని తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయని, కానీ… అయితే అంటూనే ఇండియా కూటమి పక్షాలుబిల్లును వ్యతిరేకించాయని అమిత్ షా విమర్శించారు. మూడు బిల్లులకు మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం ఉంది అని స్పష్టం చేశారు. 49 లక్షల ఓటర్లకు ఒక ఎంపీ ఎలా న్యాయం చేస్తారు అని, తెలంగాణలోని మల్కాజిగిరిలో 38 లక్షల ఓటర్లు ఉన్నారని, ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి అని తెలిపారు. కొన్ని చోట్ల 6లక్షల ఓటర్లకు ఎంపీ నియోజకవర్గం ఉందన్నారు. జనాభా లెక్కలకు డిలిమిటేషన్ కు మేం లింకు పెట్టలేదు అని, కాంగ్రెస్ హయాంలోనే ఈ లింకు పెట్టారు అని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభా సమయం వృధా చేయడం అలవాటుగా మారిందన్నారు.

డీలిమిటేషన్ ను వ్యతిరేకించడం అంటే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపును వ్యతిరేకించినట్లేనని అమిత్ షా తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగితే సీట్లు కూడా పెరుగుతాయి అని తెలిపారు. 1971నుంచి సీట్ల పెంపుపై ఫ్రీజ్ ఉందన్నారు. ఎమర్జన్సీ కాలంలోనే డీలిమిటేషన్ పెంపుపై నిషేధం పెట్టిందని, ఇప్పుడు కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి కూడా సీట్ల పెంపును అడ్డుకుంటుందని ఆరోపించారు.

అందరి అభిప్రాయంతో 2026లో కులగణనతో పాటు జనగణన చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం అని, 2024లో చేద్దామనుకుంటే కులగణన డిమాండ్ తెరపైకి తెచ్చారు అని పేర్కొన్నారు మేం ఇప్పుడు కులగణన చేస్తుంటే అభినందించేందుకు ప్రతిపక్షాలకు చేతులు రావడం లేదన్నారు. జనగణన, కులగణన కలిపి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని గుర్తు చేశారు. కొత్త జనాభా లెక్కల్లో కులం కాలమ్ చేర్చామని పేర్కొన్నారు. కులగణనను అడ్డుకునేందుకు రాజ్యాంగ సవరణ చేస్తున్నారని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే జనగణన, కులగణన ప్రారంభమైందన్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం ఉత్తర, దక్షిణ భారత దేశం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. మాకు భారత్ దేశం అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం అని, విభజన రాజకీయాలతో అధికారం దక్కదని వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని ప్రాంతాలకు సమాన అధికారులు, హక్కులు ఉన్నాయని, ప్రాంతీయ బేధాలకు తావు లేదన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో రాష్ట్రాల వారిగా పెరుగబోతున్న సీట్ల సంఖ్యను అమిత్ షా వెల్లడించారు.

కాంగ్రెస్ నేత వేణుగోపాల్ కోరినట్లుగా ఈ బిల్లులో 50శాతం సీట్ల పెంపు అంశాన్ని చేరుస్తామని, ఒక గంటలో బిల్లులో మార్పు తేస్తామని, అఖిలేష్ యాదవ్ మహిళా ప్రధాని ప్రతిపాదన చేయగా..అది కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి ఇబ్బందికరంగా ఉంటుందని సెటైర్లు వేశారు. అమిత్ షా ప్రసంగం అనంతరం స్పీకర్ ఓం బిర్లా 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మూడింట రెండు వంతుల మెజార్టీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అనంతరం సభను మరుసటి రోజుకు స్పీకర్ వాయిదా వేశారు.

Latest News