Telecom Revolution NFAP 2025 | టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్‌ మార్చుకోవాలా?

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. భవిష్యత్తులో 6జీ టెక్నాలజీకి వీలుగా ఎన్‌ఎఫ్‌ఏపీ 2025ను కేంద్రం 2025 డిసెంబర్‌ 30 నుంచి అమల్లోకి తెచ్చింది.

Telecom Revolution NFAP 2025 | మీ మొబైల్‌ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో వీడియో ప్లే అవుతుంది! కారులో ప్రయాణించే సమయంలో రహదారిపై ఎక్కడా నెట్‌వర్క్‌ కట్‌ అయ్యే చాన్సే ఉండదు! గ్రామాల్లో కూడా శాటిలైట్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది! ఇవన్నీ ఒక్క రోజులో జరిగేవి కావు. కానీ.. దీనికి పునాదివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ మేరకు నేషనల్‌ ఫ్రీక్వెన్సీ అలొకేషన్‌ ప్లాన్‌ –2025 (NFAP) 2025 డిసెంబర్‌ 30వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ప్రకటించింది.

ఈ కొత్త ప్రణాళిక భవిష్యత్‌ 6జీ నెట్‌వర్క్‌లకు పునాది వేస్తుంది. ఆధునిక 5జీ సేవలకు మద్దతు ఇస్తూనే.. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌, కనెక్టెడ్‌ వెహికిల్స్‌ వంటి కొత్త టెక్నాలజీలకు దారి తీస్తుంది.

NFAP అంటే.. దేశంలో ఏ ఫ్రీక్వెన్సీని ఏ అవసరాలకు వాడాలో నిర్ణయించే అధికారి మ్యాప్‌. ఈ ప్రణాళిక ప్రకారం.. 8.3 కిలోహెర్జ్స్‌ నుంచి 3000 గిగా హెర్జ్స్‌ వరకూ ఉన్న వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌ను మొబైల్‌ సేవలు, వైఫై, టీవీ, రేడియో ప్రసారాలు, శాటిలైట్‌ కమ్యూనికేషన్లు, రక్షణ రంగం తదితరాల అవసరాలకు ఎలా ఉపయోగించాలో స్పష్టత ఇచ్చారు.

ఈ ప్రణాళిక అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) నిబంధనలకు అనుగుణంగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరువ చేస్తుందని కేంద్రం పేర్కొంటున్నది.

6జీ కోసం కీలకమైన మిడ్‌బ్యాండ్‌

6425 నుంచి 7125 మధ్య ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను అంతర్జాతీయ మొబైల్‌ టెలి కమ్యూనికేషన్స్‌ (ఐఎంటీ) కోసం గుర్తించడం ఎన్‌ఎఫ్‌ఏపీ 2025లో ముఖ్యమైన మార్పుగా చెబుతున్నారు. ఐఎంటీలో 2జీ, 3జీ, 4జీ, 5జీతోపాటు.. భవిష్యత్తు 6జీ కూడా భాగమేనని ఈ అప్పర్‌ మిడ్‌బ్యాండ్‌ 6జీకి అత్యంత కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంచి కవరేజ్‌, అధిక డాటా సామర్థ్యం.. ఈ రెండు ఒకేసారి అందుబాటులో ఉంటాయి. ఇది ఇప్పటికే ఉన్న 3.5 గిగాహెర్జ్ 5జీ బ్యాండ్స్‌కు అదనపు బలంగా నిలుస్తుంది.

ఇలా ముందుగానే బ్యాండ్స్‌ను గుర్తించడం వల్ల.. టెలికం ఆపరేటర్లు, ఎక్విప్‌మెంట్‌ తయారీదారులు, భారత్‌ 6జీ భాగస్వాములకు రానున్న పదేళ్లకు అవసరమైన ప్లానింగ్‌, ట్రయల్స్‌, నెట్‌వర్క్‌ డిజైన్‌ను ఇప్పుడు మొదలు పెట్టే అవకాశం లభిస్తుంది.

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌కూ ఎన్‌ఎఫ్‌ఏపీ గట్టి ఊతమిస్తుంది. Ka, Q, V బ్రాండ్స్‌ను నెక్స్ట్‌ జనరేషన్‌ శాటిలైట్‌ సేవల కోసం కేటాయించారు. ఇవి స్టార్‌లింక్‌ లాంటి సేవలకు, దూర ప్రాంతాల్లో 5జీ, భవిష్యత్తు 6జీకి బ్యాక్‌హాల్‌గా, భూమి–ఆకాశం మధ్య నిరంతర కనెక్టివిటీకి ఉపయోగపడతాయని అంచనా.

ఇన్‌–ఫ్లైట్‌, మారిటైమ్‌ కనెక్టివిటీ, వాహనాలు–ఇతర అన్నింటికీ కమ్యూనికేషన్‌కు స్పెక్ట్రమ్‌ సపోర్ట్‌ను NFAP 2025 ఇస్తుంది. అయితే.. ఇప్పటికిప్పుడు మీరు ఫోన్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. రాబోయే పదేళ్ల టెలికం భవిష్యత్తును, 6జీ దిశగా భారతదేశ ప్రయాణాన్ని ఇది ఇప్పుడే స్పష్టంగా చూపిస్తున్నది. సింపుల్‌గా చెప్పాలంటే.. 6జీ రాకకు ముందు సిద్ధం చేసిన ఆకాశపు బ్లూప్రింట్‌ ఇది.

Read Also |

Greenfield Highway DPR Tenders: ఫోర్త్ సిటీ టూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు డీపీఆర్ కోసం టెండర్లు
INSV Kaundinya : వండర్..ఆ ప్రాచీన నౌక మళ్లీ సముద్రంపై ప్రత్యక్షం
Naa Anveshana | నోటి దురదతో నష్టం.. ‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం

Latest News