INSV Kaundinya : భారత దేశం సముద్రపు జలాల్లో ఓ ప్రాచీన నౌక మళ్లీ ప్రత్యక్షమైంది. అద్బుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న పురాతన తెరచాప నౌక భారత సముద్ర జలాల్లో విహరిస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నది. ఇందుకు సంబంధించిన వార్తలు.. వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
అజంతా గుహల్లో లభ్యమైన 5వ శతాబ్దపు పెయింటింగ్స్ లోని ఓ నౌక చిత్రాన్ని ఆసరాగా చేసుకుని భారత నేవీ ఇంజినీర్లు ఆ ప్రాచీన నౌకను పునః సృష్టి చేశారు. దీంతో భారత పురాతన నౌక నిర్మాణాల కౌశలం మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. ఐఎన్ఎస్ వీ కౌండిన్య పేరుతో ఈ నౌకను రూపొందించారు. పూర్వ కాలంలో మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఓడలను నడిపిన దిగ్గజ నావికుడు కౌండిన్య పేరును ఈ నౌకకు పెట్టారు. భారత్ నుంచి తొలి నావికుడిగా ఆయనకు పేరుంది.
పురాతన చిత్రం నుంచి ఆధునిక లోకంలోకి..
అజంతా చిత్రంలోని పురాతన తెరచాప నౌకను తలపించేలా..ఎలాంటి లోహాలు, మేకులు, బోల్టులు లేకుండా కౌండిన్య నౌకను పూర్తిగా చెక్కలను వాడి తయారు చేశారు. కొబ్బరి పీచుతో అల్లిన తాళ్లతో, జిగురుతో చెక్కలను అనుసంధానం చేసి నిర్మించారు. దీంతో ఈ నౌకను ‘స్టిచ్డ్ షిప్’గా కూడా పిలుస్తున్నారు. 1500 ఏళ్ల క్రితం నాటి టెక్నిక్స్‌ను ఉపయోగించి.. రెండేళ్లపాటు దీనిని నిర్మించారు. ఈ ఆధునికయుగంలో ఎలాంటి యంత్రాల అవసరం లేకుండా చేతులతో నిర్మించడం విశేషం. సముద్ర ఉప్పునీటి నుంచి రక్షణ కోసం దీనికి సహజసిద్ధ జిగురుపూతను, నూనెలు పూశారు. ఈ నౌక ఇంజిన్ కు బదులుగా.. తెరచాపల సహాయంతో ప్రయాణించేలా రూపొందించారు.
ప్రాచీన నౌక నిర్మాణ నైపుణ్య ప్రతీక
ఐఎన్ఎస్‌వీ కౌండిన్య నిర్మాణం 2023లో ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత నౌకాదళం, హోదీ ఇన్నోవేషన్స్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాయి. కేరళకు చెందిన బాబు శంకరన్ బృందం ఈ నౌకను నిర్మించింది. ఎలాంటి బ్లూప్రింట్స్ లేకపోయినా.. పెయింటింగ్స్…ప్రాచీన రచనలలోని కొన్ని దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిర్మాణాన్ని కొనసాగించారు. శాస్త్రీయ పరీక్షలను ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించారు. ఫిబ్రవరి 2025లో ఇది ప్రారంభం కాగా.. మే నెలలో కర్ణాటకలోని కార్వార్‌లో నౌకాదళంలో చేరింది. నౌక పొడవు 65అడుగులు, వెడల్పు 22అడుగులు,ఎత్తు 13 అడుగులు. నౌక పూర్తిగా తెరచాపలతో గాలి దిశ ఆధారంగా నడుస్తుంది.
చారిత్రక ప్రత్యేకతలు
ఈ నౌకకు కదంబ పాలకుల రాజలాంఛనంగా ఉన్న గండభేరుండ చిత్రం, ఒక తెరచాపపై సూర్యుడి ఆకృతి ఏర్పాటు చేశారు. ముందు భాగంలో సింహ యాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతికగా కనిపించే లంగరు బొమ్మను డెక్‌పై ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు పయనమైన కౌండిన్య నౌక యాత్రను నౌకాదళ పశ్చిమ విభాగం అధిపతి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ జెండా ఊపి ప్రారంభించారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్యలో 18 మంది నావికులు ఉన్నారు. 15 రోజుల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఒమన్ చేరుకోనున్నది.
పురాతన ఓడ..పురాతన మార్గంలోనే తొలి ప్రయాణం
ప్రాచీన కాలంలో భారత పశ్చిమ తీరం నుంచి ఒమన్‌కు నౌకా ప్రయాణాలు సాగేవి. భారత పురాతన సముద్రమార్గాల్లో ఉన్న ఈ మార్గాన్నే కౌండిన్య నౌక చారిత్రాక పునరాగమనానికి గుర్తుగా ఎంచుకున్నారు. ఒమన్, ఆగ్నేయాసియా ప్రధాన వాణిజ్య మార్గంలో భారత్ కీలకంగా ఉండేది. ఈ మార్గంలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రాల వ్యాపారంతో పాటు సాంస్కృతిక, నాగరికపరమైన సంబంధాలు కొనసాగాయి. ఈ నౌక యాత్ర ద్వారా ఒమన్‌తో సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వారసత్వ పరిరక్షణ, ప్రాంతీయ సహకారం, సముద్ర యాన దౌత్య రంగాల పురోతికి యాత్ర దోహదపడుతుందని భావిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య యాత్ర ప్రారంభం సందరబ్ంగా సిబ్బందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. నౌక నిర్మాణ నిపుణులను ఆయన అభినందించారు.
INSV Kaundinya, the Indian Navy’s pioneering stitched sailing vessel, a traditional wooden ship reconstructed from 5th-century Ajanta Cave paintings embarks from Porbandar, Gujarat, to Muscat, Oman. pic.twitter.com/nKJvL1P5B6
— Sidhant Sibal (@sidhant) December 29, 2025
ఇవి కూడా చదవండి :
Uttarakhand bus accident| లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
Naa Anveshana | నోటి దురదతో నష్టం.. ‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్ర వివాదం
