BCCI | న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. స్వదేశం జరిగిన సిరీస్‌లో అవమానక రీతిలో భారత్ జట్టు 0-3 తేడాతో ఓటమిపాలవగా.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి టీమిండియా రెండోస్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ మొదలయ్యే నాటికి ప్రణాళికాబద్ధంగా జట్టును పటిష్టం చేయాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్వదేశంలో కివిస్‌పై దారుణంగా ఓడిపోవడంతో ప్రస్తుతం టీమిండియా జట్టును మొత్తం ప్రక్షాళన చేయాలనే చర్చ మొదలైంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో 5 టెస్టుల సిరీస్ జరుగనున్నది. ఈ సిరీస్ తర్వాత సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో చివరి దశలో ఉన్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఓ ఇద్దరికి ఆస్ట్రేలియా పర్యటననే చివరి అవకాశం కావొచ్చని తెలుస్తున్నది. నవంబర్ 10న భారత్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నది. అప్పటి నుంచే ఆ ఇద్దరిపై కీలక నిర్ణయం తీసుకునే సూచనలున్నాయి. ఇంగ్లండ్‌లో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించకపోతే.. ఆ తర్వాత జరిగే ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్‌కు నలుగురు సీనియర్లను పక్కనబెట్టే అవకాశం ఉందని.. ఇక స్వదేశంలో నలుగురు సీనియర్స్‌కు న్యూజిలాండ్ సిరీస్ చివరిది అయ్యే అవకాశం కావొచ్చని ఓ సీనియర్ బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వడ్డించాయి. సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై బీసీసీఐ పెద్దలు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. కెప్టెన్సీపై సైతం చర్చలు సాగుతున్నట్లుగా సమాచారం.