Site icon vidhaatha

Paris Olympics 2024| పారిస్ ఒలంపిక్స్ గేమ్స్‌లో భార‌తీయ వంట‌కాలు..ఆట‌గాళ్ల‌ ఫుడ్ మెనూ ఏంటో తెలుసా?

Paris Olympics 2024| ఒలింపిక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ టోర్నీలో పాల్గొని ప‌త‌కం సాధించాల‌నే క‌సి ప్ర‌తి అథ్లెట్‌కి ఉంటుంది. అయితే చాలా మంది అథ్లెట్స్ ఒలంపిక్స్ కోసం ఇత‌ర దేశాల‌కి వెళ్ల‌గా వారికి భోజనం విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉంటాయి. అయితే ఈ సారి భార‌త అథ్లెట్ల‌కి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఒలింపిక్స్ నిర్వాహకులు.. పారిస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో అథ్లెట్ల గ్రామంలో భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్ల పోషకాహారాన్ని విస్తృత శ్రేణి ఆహార మెనులో చేర్చారు.

పోటీలు స‌జావుగా సాగాల‌నే ఉద్దేశంతో ప్యారిస్ నిర్వాహకులు మెను నుంచి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో ఒకటైన చికెన్ నగ్గెట్స్‌ను తొల‌గించారు. . అయితే భారతీయ క్రీడాకారులు ఈ విష‌యంలో చింతించ‌న‌క్క‌ర్లేదు. చికెన్ నగ్గెట్స్ ప్యారిస్ ఒలింపిక్స్ మెనులో లేకపోయినా బటర్ చికెన్, బిర్యానీతో కూడిన రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించే అవ‌కాశం క‌ల్పించారు. ఈ రెండు వంటకాలు భారత దేశంలో ఎంత ప్ర‌సిద్ధో మ‌న‌కి తెలిసిందే. ఇవే కాక బాస్మతి బియ్యంతో చేసిన రైస్​, పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, చికెన్​, పులుసులు కూడా వ‌డ్డిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

భారత ఉపఖండంతో సహా వివిధ దేశాలకు చెందిన వంటకాలను సూచించే మెనూను నాలుగు భాగాలుగా విభజించిన‌ట్టు భారత బృందం చీఫ్ న్యూట్రిషనిస్ట్.. ఆరాధనా శర్మ తెలిపారు. అథ్లెట్స్ విలేజ్‌లో మెనూలో “వెజ్ బిర్యానీ, బటర్ చికెన్, కొంచెం కాలీఫ్లవర్ కర్రీ, పనీర్ డిష్ ఉంటాయని వారు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆహారం ప్రతిరోజూ ఉండ‌ద‌ని, అప్పుడప్పుడు మాత్ర‌మే భారతీయ అథ్లెట్లు ఈ ఆహారాన్ని రుచి చూడనున్నార‌ని వారు స్ప‌ష్టం చేశారు. పోషకాహార నిపుణుల సూచనల మేరకే ఈ లిస్ట్​ను తయారు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version