Site icon vidhaatha

Non Veg: మాంసాహార వినియోగం.. దేశంలో తెలంగాణ టాప్!

విధాత, హైదరాబాద్ : దేశంలో మాంసాహారం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందన్న సమాచారం సుక్కా.. ముక్కలో మనోళ్ల అభిరుచిని చాటుతుంది. పండగ ఏదైనా నాన్ వెజ్ వంటకాలతో జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంప్రదాయం. అందుకే ఇక్కడ మాంసం తినే ప్రజల శాతం ఎక్కువే. నేషనల్ మీట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్ఎంఆర్), నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ వో) నిర్వహించిన సర్వేలో భారత దేశంలో ఓ వ్యక్తి మాంసాహార వినియోగం సంవత్సరానికి 7.1కిలోలుగా, నెలకు 0.6కిలోలుగా ఉంది.

కొన్ని ప్రాంతాల్లో మాంస వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా, తక్కువగా ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రజల సగటు మాంస వినియోగం జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు మాంసం వినియోగం సంవత్సరానికి 23.97కిలోలు, నెలకు 2కిలోలుగా సర్వే తేల్చింది. ఇంతగా మాంసం తింటున్న ప్రజలు దేశంలో మరే రాష్ట్రంలోను లేరని సర్వే వెల్లడిస్తున్నది. దీంతో మాంసహారం వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్ గా నిలిచింది.

అందులో ఏడో స్థానం

అయితే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (ఎన్ఎఫ్ హెచ్ ఎస్-5) మాత్రం దేశంలో టాప్ 10 నాన్ వెజ్ తినే ప్రజలకు చెందిన రాష్ట్రాల జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ 97.4శాతం మాంసాహారం తినే ప్రజలతో ఏడో స్థానంలో నిలిచింది. తెలంగాణలో మగవాళ్లలో 98.8 శాతం, ఆడవాళ్లలో 98.6 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. ఇక్కడ వెజిటేరియన్ల సంఖ్య కేవలం 2 శాతం లోపే ఉంది.

నాగాలాండ్ లో 99.8శాతం ప్రజలు మాంసాహారం తింటుండగా.. ఆ రాష్ట్రాం టాప్ వన్ లో నిలిచింది. 99.3శాతంతో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, 99.1శాతంతో మూడో స్థానంలో కేరళా, 98.25శాతంతో నాల్గవ స్థానంలో ఏపీ, 97.65శాతంతో ఐదో స్థానంలో తమిళనాడు, 97.35శాతంతో ఆరో స్థానంలో ఒడిశా నిలిచింది. జర్ఖండ్, త్రిపుర, గోవాలు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.

Exit mobile version