Site icon vidhaatha

CAN vs IRE| టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి విజ‌యం సాధించి మూడో స్థానానికి దూసుకొచ్చిన కెన‌డా

CAN vs IRE| ప్ర‌స్తుతం వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మొత్తం 20 జ‌ట్లు టోర్నీలో పాల్గొంటుండ‌గా, ఇందులోని ప్ర‌తి జ‌ట్టు కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ప‌సికూన అనుకున్న అమెరికా జ‌ట్టు ఏకంగా పాకిస్తాన్‌ని మ‌ట్టి క‌రిపించింది. ఇక ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కెనడా.. 12 పరుగులు తేడాతో గెలుపొంది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి విజ‌యాన్నిన‌మోదు చేసుకుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, కెనడా బ్యాటింగ్ చేసింది. ఈ జ‌ట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు చేసింది.. ఆ జట్టు బ్యాటర్లలో నికోలస్ కిర్టన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ మొవ్వ(36 బంతుల్లో 3 ఫోర్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఆ మాత్రం స్కోరు ద‌క్కింది.

ఐర్లాండ్ బౌలర్లలో క్రైగ్ యంగ్, బ్యారీ మెక్‌కార్తీలు అద్భుతంగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, గారెత్ డెలానీ తలో వికెట్ తీసారు. ఇక‌ లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. జియోర్జ్ డాక్‌రెల్(22 బంతుల్లో 29 నాటౌట్), మార్క్ అడైర్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు. కెనడా బౌలర్లలో డిలాన్ హేలైర్(2/18), జెర్మీ గోర్డాన్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. జునైద్ సిద్దికీ, సాద్ బిన్ జఫర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ కూడా చాలా ఆస‌క్తిక‌రంగానే సాగింది.

చివ‌రి ఓవ‌ర్‌లో ఐర్లాండ్ విజ‌యం కోసం 17 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. అంద‌రు ఆ ల‌క్ష్యాన్నిసులువుగానే చేధిస్తార‌ని అనుకున్నారు. కాని జెర్మీ గోర్డాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సంచలన విజయాన్నందించాడు. రెండో బంతికే మార్క్ అడైర్‌ను క్యాచ్ ఔట్ చేసిన జెర్మీ గోర్డాన్.. తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క బౌండరీ ఇవ్వకుండా కేవ‌లం నాలుగు పరుగులే ఇచ్చాడు.దీంతో కెన‌డా 12 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ గెలుపుతో కెనడా పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దూసుకొచ్చింది.

Exit mobile version