Site icon vidhaatha

పేలవమైన ఆటతీరుతో పంజాబ్​ పరాజయం

ఐపిఎల్​‌‌–2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్​, చెన్నైజట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో చెన్నై 28 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న పీకే జట్టు మంచి నిర్ణయమే తీసుకుంది. తమ బౌలర్ల ధాటికి చెన్నై బ్యాటర్లు విలవిలలాడారు. ఒక్కో పరుగు చేయడానికి చాలా కష్టపడ్డారు. కెప్టెన్​ గైక్వాడ్(32)​, డారిల్​ మిచెల్​(30), జడేజా(43)తప్ప మిగిలినవారంతా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. డాషింగ్​ బ్యాటర్​ శివమ్​ దూబే, మాస్టర్​ ధోనీ గోల్డెన్​ డక్​ఔట్ కావడం విశేషం. మొత్తానికి చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగలగింది. పంజాబ్​ బౌలర్లలో హర్షల్​ పటేల్​ (3), రాహుల్​ చాహర్​(3), అర్షదీప్​ సింగ్​(2) చెన్నై పతనాన్ని శాసించారు.

168 పరుగు స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్​ విజయం లాంభనమే అనుకున్నారంతా. కానీ, ధోనీ వ్యూహాల ముందు పంజాబ్​ కెప్టెన్​ సామ్​ కరన్​ ఆటలు ఫలించలేదు. జట్టు స్కోరు 9 పరుగులున్నప్పుడే హిట్టర్​ ఓపెనర్​ జానీ బెయిర్​స్టో(7), ఆ తర్వాత వచ్చిన రిలీ రోసౌ(0) ఇద్దరూ అవుటవడంతో పంజాబ్​ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఇద్దరినీ తుషార్ దేశ్​పాండే అద్భుతంగా క్లీన్​ బౌల్డ్​ చేసాడు. ఓపెనర్​ ప్రభ్​సిమ్రన్​ సింగ్​ (30), శశాంక్​సింగ్​(27) కాసేపు పోరాడినా, రవీంద్ర జడేజా (3 వికెట్లు) దెబ్బకు కీలక బ్యాటర్లు పెవిలియన్​ చేరారు.  ఆ తర్వాత ఏ దశలోనూ పంజాబ్​ కోలుకోలేదు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.  చెన్నై బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసుకోగా, దేశ్​పాండే, సిమర్​జిత్​ సింగ్​ చెరో రెండు, శాంట్నర్​, శార్డూల్​ చెరో వికెట్​ తీసుకున్నారు. దీంతో ప్లేఆఫ్​ రేసు నుండి పంజాబ్​ దాదాపు నిష్క్రమించినట్లే.

Exit mobile version