Ravindra Jadeja | జడేజా ఔట్​ కరెక్టే : చెన్నై కోచ్​

రాజస్థాన్​ రాయల్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య నిన్న జరిగిన ఐపిఎల్​ మ్యాచ్​లో జడేజా ఫీల్డింగ్​కు అంతరాయం కలిగించినందుకు అవుటయ్యాడు. దీంతో జడేజా తీవ్ర అసహనానికి గురయ్యాడు.

  • Publish Date - May 13, 2024 / 09:28 PM IST

ఐపిఎల్​ 2024లో భాగంగా నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్ (RR vs CSK)​లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించిన  విషయం విదితమే. అయితే చెన్నై బ్యాటింగ్​ సమయంలో కెప్టెన్​ రుతురాజ్​తో సమన్వయలోపం వల్ల  “ ఫీల్డింగ్​కు అంతరాయం(Obstructing the Field)” కలిగించినందుకు అవుటయ్యాడు.  ఐపిఎల్​ చరిత్రలో ఈ విధంగా ఔటవడం ఇది మూడవసారి. ఇంతకుముందు యూసుఫ్​ పఠాన్(2013) ​, అమిత్​ మిశ్రా(2019) ఈ రీతిలో అవుటయ్యారు. దీంతో క్రికెట్​ ప్రపంచంలో చర్చ మొదలయింది. జడేజాను థర్డ్​ అంపైర్​ ఔట్​ ఇవ్వడం సబబేనా అనేది చర్చ.

అసలు జరిగిందేంటంటే, ఇన్నింగ్స్​ పదహారో ఓవర్లో జడేజా థర్డ్​మ్యాన్​ దిశగా బాల్​ను తరలించి ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు మొదలుపెట్టాడు. కానీ, అటువైపు చేరుకున్న రుతురాజ్​ గైక్వాడ్​ రెండో పరుగు నిరాకరించాడు. దాంతో అప్పటికే సగం దూరం దాటి వచ్చిన జడేజా వెనుదిరిగాడు. అదే సమయంలో బాల్​ను అందుకున్న కీపర్​ కెప్టెన్ సంజూశాంసన్​(Sanju Samson) వేగంగా బాల్​ను నాన్​ స్ట్రయికర్​ వికెట్ల వైపు విసిరాడు. ఆ క్రమంలో పరుగు తీస్తున్న జడేజా పరుగు దిశను మార్చుకుని బాల్​ దారిలోకి వచ్చేసాడు. అది విసురుగా జడేజా వీపుకి తాకి, పక్కకి వెళ్లిపోయింది. దాంతో అసహనానికి గురైన సంజూ, అంపైర్​కు అప్పీల్​ చేసాడు. ఫీల్డ్​ అంపైర్, థర్డ్​ అంపైర్​కు నివేదించగా, థర్డ్​ అంపైర్​ అనిల్​ చౌదరి ​దాన్ని ‘అబ్​స్ట్రక్టింగ్​ ది ఫీల్డ్’​గా పరిగణించి అవుట్​ ఇచ్చాడు.

క్రికెట్​లో నిబంధనలను రూపొందించే మెరిల్​బోర్న్​ క్రికెట్​ క్లబ్​ (ఎంసీసీ) రూల్​ 37.1 ప్రకారం, ‘ఎవరైనా బ్యాటర్​, బంతి ఫీల్డ్​లో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్​ను మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ అడ్డుకుంటే దాన్ని అబ్​స్ట్రక్టింగ్​ ది ఫీల్డ్​గా పరిగణించవచ్చు.’

చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాటింగ్​ కోచ్​ మైక్​ హస్సీ(Michael Hussy) మాట్లాడుతూ, ఈ నిర్ణయం ఎలాగైనా ఉండిఉండవచ్చు. జడేజా వెనుదిరిగినప్పుడు తను పరుగు తీస్తున్న కోణం కొంత మారివుండవచ్చు. అయితే బ్యాటర్​ తన పరుగు లైన్​ను మార్చుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి కాబట్టి, అంపైర్​ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. దాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే రూల్​ ఈజ్​ రూల్​. అన్నాడు. అలాగే, రాజస్థాన్​ క్రికెట్​ డైరెక్టర్​ సంగక్కర (Kumara Sangakkara) మాట్లాడుతూ, అంపైర్​ నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేసాడు. క్రికెట్​ చట్టాల ప్రకారం, బ్యాటర్​ బంతి పయనిస్తున్న దారిలోకి రాకూడదు. ఈమధ్య రూల్స్​ మారాయి. బ్యాటర్​ పిచ్​ మధ్యలో పరుగెడుతున్నాకూడా బంతి బ్యాటర్​కు తగిలితే దాన్ని అవుట్​గానే పరిగణిస్తున్నారు. నిజానికి జడేజా అదే పక్కనుండి పరిగెట్టిఉంటే సమస్య ఉండేది కాదు. అని తెలిపాడు.

ఏదేమైనా మ్యాచ్​ను చెన్నై గెలిచింది కాబట్టి, ఈ విషయం గురించి చెన్నై అంతగా పట్టించుకోలేదు. ఒకవేళ ఓడిపోయివుంటే , ఈ చర్చ మరింత రసవత్తరంగా ఉండేది.

Latest News