భారత్, శ్రీలంకల మధ్య మొదలైన టి20 సిరీస్ (IND vs SL T20I Series) మొదటి మ్యాచ్‌లో భారత్ విజయభేరి మోగించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)(21 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 40 పరుగులు), శుభమన్ గిల్ Shubman Gill(16 బంతుల్లో 34 పరుగులు, ఒక సిక్స్, 6 ఫోర్లు ) పవర్‌ప్లే ముగిసేసరికి 74 పరుగులు జోడించి, సరిగ్గా అక్కడే గిల్ వికెట్ పారేసుకున్నాడు. 74/0 కాస్తా 74/1 అయింది. ఆ వెంటనే మరో ఓపెనర్ జైస్వాల్ పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లో ఇద్దరు కొత్త బ్యాటర్లు, కెప్టన్ సూర్యకుమార్ యాదవ్(New Captain Surya Kumar Yadav), రిషభ్ పంత్ ఉండటంతో శ్రీలంక మరో వికెట్ కోసం ప్రయత్నించింది కానీ, కెప్టెన్ దూకుడు ముందు వాళ్ల మంత్రాలు పారలేదు. సూర్య తాను కెప్టెన్ అయినా ఆటతీరులో ఏ మాత్రం మార్పు ఉండదని చెప్పినట్లే చేసాడు. శ్రీలంక బౌలర్లను చీల్చిచెండాడాడు. మరోవైపు పంత్ సూర్యకే ఎక్కువగా స్ట్రైయికింగ్ ఇస్తూ నెమ్మదిగా స్కోరును పెంచినా, సూర్య దెబ్బకు రన్‌రేట్ ఏమాత్రం తగ్గకుండా పరుగులెత్తింది. ఇద్దరూ మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించాక, సూర్య అవుటయ్యాడు (76/3). కెప్టెన్‌గా తొలిమ్యాచ్‌లోనే తన రెండో వేగవంతమైన అర్ధశతకం(26 బంతుల్లో 58 పరుగులు: 2 సిక్స్‌లు, 8 ఫోర్లు) బాది తానేమీ తగ్గేదే లే అని నిరూపించాడు. ఆ తర్వాత పంత్(33 బంతుల్లో 49 పరుగులు: ఒక సిక్స్, 6 ఫోర్లు) వేగం పెంచి స్కోరుబోర్డును ఉరకలెత్తించే బాధ్యత తీసుకున్నాడు. కానీ, రెండో ఎండ్‌లో వికెట్లు రాలుతునే ఉన్నాయి. రింకూ, పాండ్యా, పరాగ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్ చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 213(213/7 in 20 Overs) పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో స్టార్ బౌలర్ పతిరణ(Pathirana) 4 వికెట్లతో నిప్పులు కురిపించగా, మధుశంక, తీక్షణ, హసరంగ తలా ఒకో వికెట్ తీసుకున్నారు.
214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక బ్యాటర్లు ఆదినుంచే చెలరేగిపోయారు. అచ్చు భారత్‌లానే ఆడుతూ, వికెట్ ఇవ్వకుండా రన్‌రేట్ తగ్గకుండా భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్లు నిశాంక(Nissanka), మెండిస్‌లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ముఖ్యంగా నిశాంక చిచ్చరపిడుగులా చెలరేగి 48 బంతుల్లో 4 సిక్స్‌లు, 7 ఫోర్లతో 79 పరుగులు చేసాడు. 45 పరుగులు చేసిన మెండిస్(Kushal Mendis) చివరికి జట్టు 84 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 140 పరుగుల వద్ద నిశాంక పెవిలియన్ చేరగా, 140/2 (14.1 ఓవర్లు) తో మ్యాచ్ పూర్తిగా శ్రీలంక చేతుల్లోనే ఉన్నట్లు కనిపించింది. కానీ, లక్ష్యం పెద్దది కావడంతో వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో శ్రీలంక బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. చివరికి 19.2 ఓవర్లకు శ్రీలంక 170 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి చవిచూసింది. శ్రీలంక రెండు వికెట్లకు 140 పరుగులు చేసి, ఆఖరి 8 వికెట్లను కేవలం 30 పరుగులకే చేజార్చుకుంది.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్(Riyan Parag) 3 వికెట్లతో చెలరేగగా, అర్షదీప్, అక్షర్, తలా రెండు వికెట్లు, సిరాజ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.