Lighting, Rain Force Abandonment of 5th T20I; India Win Series 2-1 vs Australia
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
బ్రిస్బేన్:
IND won T20 Series | ఆస్ట్రేలియాతో ఐదో మరియు చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదటి మ్యాచ్ కూడా రద్దు కావడంతో, మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆట జరిగిన 3 మ్యాచులను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (23 నాటౌట్, 13 బంతులు), శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్, 16 బంతులు) సునామీలా విరుచుకుపడటంతో, భారత్ కేవలం 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసింది. అయితే ఆ సమయంలో ఉరుములు, మెరుపులు రావడంతో ఆట నిలిపివేశారు. ఆ తరువాత కురిసిన భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దు అయింది. సాధారణంగా వర్షం ఉన్నా, లేకున్నా, ఉరుములు, మెరుపులు ఉంటే మ్యాచ్‌ను నిలిపివేస్తారు. (ఎందుకంటే ఆ సమయంలో పిడుగులు పడే పరిస్థితి ఉంటుంది. విశాలమైన మైదానంలో ఆటగాళ్లుంటారు, వారిపైనే పిడుగు పడే అవకాశాలు ఎక్కువ.)
ఆస్ట్రేలియాకు కొన్ని అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మొదటి ఓవర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అభిషేక్ క్యాచ్ వదిలేశాడు. నాలుగో ఓవర్‌లో బెన్ ద్వార్షుయిస్ కూడా సులభమైన క్యాచ్ మిస్ చేశాడు. ఈ తప్పిదాల తరువాత అభిషేక్ అదే ఓవర్‌లో అద్భుతమైన సిక్స్ బాదాడు. గిల్ కూడా దూకుడుగా ఆడుతూ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు.
సిరీస్ విజయం భారత్‌దే – అద్భుత పునరాగమనం
మొదటి టీ20 కూడా వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. కానీ, తరువాతి రెండు మ్యాచ్‌లలో భారత్ తిరిగి పుంజుకుని మూడో మ్యాచ్‌ను ఐదు వికెట్ల తేడాతో, నాలుగో మ్యాచ్‌ను 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో గెలిచినా, ఈసారి టీ20ల్లో భారత్ సాధికారిక విజయాన్ని సాధించింది. సిరీస్‌లో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, గిల్, అర్షదీప్ సింగ్‌ల ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఈ సిరీస్ ద్వారా టీమిండియా రాబోయే టి20 ప్రపంచకప్ కోసం తన బ్యాటింగ్ కాంబినేషన్ మరియు బౌలింగ్ ఆప్షన్లపై ఒక అవగాహనకు వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
