Site icon vidhaatha

Vinesh Phogat | రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అప్పీల్‌పై ముగిసిన విచారణ..! నిర్ణయం ప్రకటించనున్న ఆర్బిట్రేటర్‌

Vinesh Phogat | మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అప్పీల్‌పై కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (CAS)లో విచారణ ముగిసింది. ఆమె అప్పీల్‌పై ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. ఆదివారం రోజున పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసేలోగా ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అడ్‌హాక్‌ విభాగం పేర్కొంది. వినేశ్‌ తరఫున ప్రముఖ సీనియర్‌ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్‌ సింఘానియా వాదనలు వినిపించారు. విచారణకు ముందు అన్నిపక్షాలకు వివరణాత్మకంగా చట్టపరమైన అఫిడవిట్‌లను సమర్పించేందుకు ఆర్బిట్రేషన్‌ అవకాశం కల్పించింది. అనంతరం వాదనలు కొనసాగాయి.

మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటుపడింది. దాంతో పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. స్పోర్ట్స్ ట్రిబ్యునల్‌లో వినేశ్‌ రెండు అప్పీళ్లను దాఖలు చేసింది. మొదట తనకు గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం కల్పించాలని కోరింది. రెండో అప్పీల్‌లో సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌ని ఆపలేమంటూ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ అప్పీల్‌ను తిరస్కరించింది. అయితే, క్రీడల సమయంలో వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఏఎస్‌ తాత్కాలిక విభాగం వినేష్‌ రెండో విజ్ఞప్తిని అంగీకరించింది. గోల్డ్‌ మెడల్‌ కోసం సారా ఆన్‌ హిల్డెబ్రాంట్‌పై పోరాడాల్సి ఉండగా.. 100 గ్రాములు అధికంగా బరువు ఉండగా అనర్హత వేటుపడింది. దీన్ని వ్యతిరేకిస్తూ వినేశ్‌ అప్పీల్‌ చేసింది. సెమీ ఫైనల్‌లో ఆమె చేతిలో ఓటమిపాలైన క్యూబా రెజ్లర్‌ యూస్నెలిన్‌ గుజ్మాన్‌ లోపెజ్‌ ఫైనల్‌కు వెళ్లింది. అప్పీల్‌లో లోపెజ్‌తో కలిసి రజత పతకం ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా.. క్రీడల అడ్‌హక్‌ కమిటీ డివిజన్‌ ముందు వాదనలు వినిపించామని.. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.

ఈ విషయం ఇంకా న్యాయస్థానంలో ఉందని.. ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్ బెన్నెట్ (ఆస్ట్రేలియా) అన్ని పార్టీల వాదనలు విన్నారని భారతీయ ఒలింపిక్‌ సంఘం స్పష్టం చేసింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), భారత ఒలింపిక్‌ సంఘం దాదాపు మూడు గంటల పాటు ఏకైక ఆర్బిట్రేటర్‌ ముందు వాదనలు వినిపించాయి. త్వరలోనే వివరణాత్మక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన హరీశ్‌ సాల్వే, విదుష్పత్‌ సింఘానియాకు ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ధన్యవాదాలు తెలిపారు. వినేశ్‌ కేసులో ఎలాంటి ఫలితం వచ్చినా.. రెజ్లర్‌కు అండగా నిలుస్తామని.. ఇదే తమ కర్తవ్యమని పీటీ ఉష స్పష్టం చేశారు.

Read Also :

Paris Olympics | రెజ్లింగ్‌లో అమన్‌ సెహ్రావత్‌ ‘పట్టు’.. భారత్‌ ఖాతాలో మరో కాంస్య పతకం..

Paris Olympics 2024 | ముగింపు దశకు పారిస్‌ ఒలింపిక్స్‌.. రెజ్లర్‌ రీతికా పసిడిపట్టు పట్టేనా..!

Exit mobile version