న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ 2025 విజేత భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్బంగా జట్టు క్రీడాకారులతో రాష్ట్రపతి ముచ్చటించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. భేటీ సందర్భంగా రాష్టపతికి భారత కెప్టెన్ హర్మీన్ ప్రీత్ కౌర్ టీమిండియా జెర్సీని బహుకరించారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన టీమిండియా క్రీడాకారిణులు చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్రపతి అభినందించారు. ఈ జట్టు భారతదేశాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె అన్నారు. వారు వేర్వేరు ప్రాంతాలు, విభిన్న సామాజిక నేపథ్యాలు, విభిన్న పరిస్థితుల నుంచి వచ్చినప్పటికి..ఒకే జట్టుగా సమిష్టిగా రాణించి ప్రపంచ కప్ సాధించడం ద్వారా భారత దేశ ఔన్నాత్యాన్ని పెంపొందించారని కొనియాడారు. అంతకుముందు భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కావడం జరిగింది.
