Site icon vidhaatha

కోల్‌క‌త్తా వ‌రుస విజ‌యాల‌కి బ్రేక్.. విచిత్రకరమైన రికార్డును సొంతం చేసుకున్న‌రుతురాజ్

ఈ సీజ‌న్‌లో కోల్‌క‌త్తా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం ప‌రాజ‌యం చ‌వి చూడాల్సి వ‌చ్చింది.చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై స‌మిష్టిగా రాణించ‌డంతో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో జడేజా అద‌ర‌గొట్ట‌గా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపాడు.ఈ క్ర‌మంలో సీఎస్‌కేను ఓడించాలనే కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టిన‌ట్టైంది. మ్యాచ్‌లో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసింది. రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే(3/33) అద్భుత‌మైన బౌలింగ్‌తో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అంగ్‌క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) మాత్ర‌మే రెండంకెల స్కోరు చేశారు.

ఇక లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో9 ఫోర్లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్(25), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు. ఫియర్‌లెస్ అటాకింగ్ గేమ్‌.. కట్టడైన బౌలింగ్‌తో మంచి విజ‌యాలు అందుకున్న కేకేఆర్ చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని చెప్పాలి. అనుకూల్ రాయ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపిస్తూ గంభీర్ చేసిన ప్రయోగం కూడా పూర్తిగా బెడిసికొట్టింది. ఇక సోమవారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ నమోదు చేయ‌డంతో ఓ విచిత్రకరమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

గత ఐదు ఏళ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా అరుదైన ఘ‌న‌త సాధించాడు. గత సీజన్ వరకు చెన్నై సారథిగా ఉన్న‌ మహేంద్ర సింగ్ ధోనీ గత ఐదేళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. 2022 సీజన్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసినా.. ఆ స‌మ‌యంలో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా 2019 సీజన్‌లో చివరిసారిగా అర్ధ‌సెంచ‌రీ చేశాడు. ఇక ఐదేళ్ల త‌ర్వాత రుతురాజ్ మ‌ళ్లీ హాఫ్ సెంచ‌రీ చేశాడు.

Exit mobile version